డెక్కన్ క్రానికల్ నష్టం 14 కోట్లు

12 Oct, 2013 02:26 IST|Sakshi
డెక్కన్ క్రానికల్ నష్టం 14 కోట్లు


 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పీకల్లోతు అప్పుల ఊబిలో కూరుకుపోయిన డెక్కన్ క్రానికల్ హోల్డింగ్ లిమిటెడ్ జూన్‌తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి రూ.301 కోట్ల ఆదాయంపై రూ.14.06 కోట్ల నష్టాన్ని ప్రకటించింది.  ఈ తొమ్మిది నెలల కాలాన్ని పూర్తి ఆర్థిక సంవత్సరంగా ప్రకటిస్తూ  అక్టోబర్7న జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ శుక్రవారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. గడిచిన సంవత్సరం సెప్టెంబర్ మాసం నాటికి 18 నెలలను ఆర్థిక సంవత్సరంగా ప్రకటిస్తూ ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్, 2012 నాటికి డీసీహెచ్‌ఎల్ రూ.843.41 కోట్ల ఆదాయంపై రూ.1,040 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. సెప్టెంబర్, 2013తో ముగిసిన మూడు నెలల కాలానికి రూ.91.20 కోట్ల ఆదాయంపై రూ.26.66 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. గతంలో రూ.10 కోట్ల మిగులు నిధులతో పాజిటివ్ నెట్‌వర్త్ ఉంటే ఇప్పుడది రూ. 4 కోట్ల నెగిటివ్ నెట్‌వర్త్‌లోకి జారుకున్నట్లు డీసీహెచ్‌ఎల్ బ్యాలెన్స్ షీట్ తెలియచేస్తోంది.
 
  డీసీహెచ్‌ఎల్ మూలధనం రూ.41.79 కోట్లు అయితే రూ.45.85 కోట్ల లోటును చూపించింది. సిక్ ఇండస్ట్రీగా పరిగణించమని బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీ-కనస్ట్రక్షన్ (బీఐఎఫ్‌ఆర్) ఆశ్రయించగా, దాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు డీసీహెచ్‌ఎల్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్30, 2013 నాటికి సాధారణ వడ్డీకింద రూ.502.28 కోట్ల అప్పులు ఉన్నట్లు మాత్రమే ప్రకటించింది. ఈ అప్పులకు చెల్లించాల్సిన వడ్డీలను, బకాయిలను కంపెనీ ఎక్కడా పేర్కొనలేదు. సీబీఐ, ఇన్‌కమ్‌ట్యాక్స్ సంస్థల దర్యాప్తులు జరుగుతున్నాయని, అలాగే ఇప్పటికే బకాయిపడ్డ కొన్ని సంస్థలు స్థిరాస్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది.

మరిన్ని వార్తలు