'మరణశిక్షలపై మారటోరియం విధించాలి'

29 Jul, 2015 18:48 IST|Sakshi
'మరణశిక్షలపై మారటోరియం విధించాలి'

న్యూఢిల్లీ: యాకూబ్ మెమన్ కు సుప్రీంకోర్టు ఉరిశిక్ష ఖరారు చేయడం పట్ల సీపీఐ ఆందోళన వ్యక్తం చేసింది. మరణశిక్ష రద్దు చేసేలా చట్టాల్లో మార్పులు చేయాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి డి రాజా అన్నారు. కన్నుకు కన్ను, పన్నుకు పన్ను అనేది భారత న్యాయవ్యవస్థ సిద్ధాంతం కాదని స్పష్టం చేశారు.

చట్టాలను పునఃపరిశీలించి మరణశిక్షను రద్దు చేయాలని అభిప్రాయపడ్డారు. మరణశిక్షను తమ పార్టీ వ్యతిరేకిస్తోందని చెప్పారు. ఉరిశిక్ష రద్దు చేయాలని కోరుతూ రాజ్యసభలో ఆయన ప్రైవేటు తీర్మానం ప్రవేశపెట్టారు. ఉరి శిక్షలను రద్దు చేసే వరకు ఇప్పటివరకు విధించిన మరణశిక్షల అమలుపై మారటోరియం విధించాలని ఆయన డిమాండ్ చేశారు.

కులం, మతం ప్రాతిపదికన మరణశిక్షలు విధిస్తున్నారని నేషనల్ లా యూనివర్సిటీ అధ్యయంలో తేలిన విషయాన్ని ఆయనీ సందర్భంగా గుర్తు చేశారు. తీవ్రవాదం కేసుల్లో మరణశిక్ష పడినవారిలో 94 శాతం మంది దళిత లేదా మైనారిటీ వర్గాలకు చెందినవారేనని అధ్యయంలో వెల్లడైందన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా మరణశిక్షకు వ్యతిరేకంగా గళం విప్పారని తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు