నలుగురు మంత్రులకు హైకోర్టు నోటీసులు

18 Jul, 2017 16:45 IST|Sakshi
పార్టీ ఫిరాయింపు మంత్రులకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌ :  పార్టీ ఫిరాయించి ఏపీ ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిని ఆ పదవుల నుంచి తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. పార్టీ ఫిరాయించి మంత్రి పదవులు అనుభవించడం చట్ట విరుద్ధమంటూ జర్నలిస్ట్‌ శివప్రసాద్‌ రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై ఇవాళ న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. ఆర్టికల్‌ 164 (1బి) ప్రకారం పార్టీ మారినవారిని మంత్రులుగా నియమించడం చట్టవిరుద్ధమని పిటిషన్‌ శివప్రసాద్‌ రెడ‍్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

దీనిపై నలుగురు మంత్రులకు హైకోర్టు నోటీసులు జారీ చేసి, నాలుగు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అలాగే తెలంగాణలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కేసును కూడా ఇదే కేసుతో విచారణ చేస్తామని న్యాయస్థానం తెలిపింది. తదుపరి విచారణను నాలుగువారాల పాటు వాయిదా వేసింది. కాగా ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ విస్తరణలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బీఫారమ్‌పై ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఎన్‌.అమరనాథ్‌రెడ్డి, సి.ఆదినారాయణరెడ్డి, రావు సుజయ్‌కృష్ణ రంగారావు, భూమా అఖిలప్రియ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన విషయం విదితమే. అలాగే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ టీడీపీ నుంచి గెలిచి అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరి, మంత్రి పదవి చేపట్టారు.