నేపాల్ భూకంప బాధితుల కళ్ళలో... 'రోహాన్ కళ'

2 Oct, 2015 00:01 IST|Sakshi
నేపాల్ భూకంప బాధితుల కళ్ళలో... 'రోహాన్ కళ'

అతడిలో కేవలం కళాత్మక హృదయమే కాదు... చలించిపోయే మనస్తత్వం ఉన్నట్టు కూడ కనిపిస్తుంది. అందుకే వెళ్ళింది విహార యాత్రకైనా అక్కడి అందాలకు ముగ్ధుడయ్యాడు. తనకు కనిపించిన అద్భుత ప్రకృతి దృశ్యాలతో పాటు, అక్కడి కట్టడాల సౌందర్యాన్నీ.. కంటిపాపలో చిత్రాలుగా పొందుపరచుకున్నాడు. ఢిల్లీకి చెందిన  ఆర్కిటెక్ట్ రోహాన్ పట్నాకర్... నేపాల్ సౌందర్యాన్ని చూసి సంవత్సరం కూడ కాలేదు. ఇంతలో వచ్చిన భూ కంపం ఆ ప్రాంతాన్ని అక్కడి జనాన్ని కకావికలం చేయడం తట్టుకోలేక పోయాడు. తన గుండెల్లో సాక్షాత్కరించిన సౌందర్యాన్నినేపాల్ లో తిరిగి సృష్టించేందుకు తనవంతు కృషి చేస్తున్నాడు.

భూకంపంతో తునాతునకలైన అందమైన నేపాల్ చిత్ర పటాన్ని తిరిగి ఆవిష్కరించాలని రోహాన్ ఆత్రుత పడుతున్నాడు. తన ప్రతిభతో  కుంచెకు రంగులద్ది.. నేపాల్ లోని అద్భుత కట్టడాలను చిత్రాలుగా తీర్చి దిద్దాడు. భూకంపానికి ముందున్న స్థితికి నేపాల్ ను తేవాలన్నదే ఆశయంగా వాటర్ కలర్స్ తో నేపాల్ లోని సౌందర్యాన్ని, చారిత్రక కట్టడాలను స్కెచ్ లు గా మలచి వాటితో వచ్చిన డబ్బును నేపాల్ రూరల్ ప్రాంతాన్ని తిరిగి నిర్మించేందుకు పాటు పడుతున్నాడు.

''మా కంపెనీ ప్రాజెక్టు పనిమీద నేను నేపాల్ వెళ్ళాను. ఆ పర్యటన నన్ను నేపాల్ లోని అందాలను తిలకించేందుకు అవకాశాన్నిచ్చింది. అలాగే అక్కడి నా కొలీగ్స్ ను కలిసేందుకు, వారి సంప్రదాయ వంటకాలను రుచి చూసేందుకు మంచి సందర్భమైంది. అక్కడి నుంచి తిరిగి వచ్చాక నేను నా ప్రతి జ్ఞాపకాన్నీ నోట్ బుక్ లో డ్రాయింగ్స్ గానూ, అక్షరాలుగాను నింపేశాను.'' అంటాడు రోహాన్.

ఏప్రిల్ 2015 లో వచ్చిన నేపాల్ భూకంపం రోహాన్ చూసిన ఎన్నో అందాలను తనలో కలిపేసుకుంది. కొందరు సహోద్యోగుల కుటుంబాలు.. ఇళ్ళతో సహా.. బంధువులనూ కోల్పోయారు. ఒకప్పుడు భూలోక సౌందర్యంగా తాను గుర్తించిన ఆ ప్రాంతం భూకంపంతో శిథిలంగా మారిపోయింది. భూకంపం విషయం తెలిసిన వెంటనే రోహాన్ నేపాల్ లోని తన స్నేహితులతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికప్పుడు ఎటువంటి సమాచారం తెలియలేదు.

''కొన్నాళ్ళ తర్వాత నా స్నేహితులు ఢిల్లీకి తిరిగి వచ్చారు. మేమంతా కలసి నేపాల్ లో భూకంప బాధిత ప్రాంత వాసులకు ఏదో ఒక సహాయం అందించాలని అనుకున్నాం. అందుకోసం విరాళాలను సేకరించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాం. కొన్ని వారాల తర్వాత కఠ్మాండు లోని స్నేహితులతో కూడ మాట్లాడాం. అప్పటికే వారు అక్కడి భూకంప బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రారంభించారు. దీంతో వారికి మరింత సహాయం అందించేందుకు మా ప్రయత్నాలు కొనసాగించాం'' అంటాడు రోహాన్.

అయితే ఫండ్స్ ఎలా సేకరించాలన్న ఆలోచన మొదట్లో కాస్త ఆందోళనకు గురిచేసినా... రోహాన్ కు వెంటనే సమాధానం దొరికింది. తనకు ఇష్టమైన కళను విరాళాలు సేకరించేందుకు వినియోగించాలని నిశ్చయించుకున్నాడు. నేపాల్ లోని అద్భుతమైన చిత్రాలకు తన కుంచెతో ప్రాణం పోశాడు. అదే సమయంలో చెన్నై, హైదరాబాద్ లకు చెందిన  రోహాన్ స్నేహితులు కూడ పుస్తకాల అట్టలపై డ్రాయింగ్స్ తో రోహాన్ కు సహకారం అందించారు. పోస్ట్ కార్డ్, నోట్ బుక్, ఎ3 సైజుల్లో వేసిన డ్రాయింగ్స్ ఫండ్ కోసం అమ్మకానికి పెట్టారు. 150 నోట్ బుక్స్, 30 ఆర్ట్ ప్రింట్లు, 100 పోస్ట్ కార్డ్ డ్రాయింగ్స్ అమ్మగా వచ్చిన సుమారు లక్ష రూపాయలను నేపాల్ పునర్నిర్మాణానికి అందించారు.

రోహాన్ కఠ్మాడు ఆర్కిటెక్ట్ స్నేహితులు ఆ విరాళంతో భూకంపంతో శిథిలమైన పలు సిమెంట్, చెక్క నిర్మాణాల స్థానంలో వెదురుతో ఇళ్ళను నిర్మించి బాధితులకు సహాయ పడ్డారు. నాలుగు రకాల మోడల్ హోమ్స్ కట్టి... బాధితులకు అందించారు. తమలాగే మరెవరైనా నేపాల్ బాధితులకు సహాయం అందించేందుకు తోడ్పడాలని రోహాన్... అతిని మిత్రులు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు