-

అనిల్ అంబానీకి సమన్లపై నిర్ణయం వాయిదా

17 Jul, 2013 13:54 IST|Sakshi
అనిల్ అంబానీకి సమన్లపై నిర్ణయం వాయిదా

న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రం కుంభకోణం కేసులో సాక్ష్యమిచ్చేందుకు అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీ, ఆయన భార్య టీనా అంబానీలకు సమన్లు జారీ చేయాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై నిర్ణయాన్ని ఢిల్లీ కోర్టు జూలై 19కి వాయిదా వేసింది. అనిల్ అంబానీ, టీనా అంబానీలతో పాటు పలువురిని ప్రాసిక్యూషన్ సాక్షులుగా కోరుతున్నామని ప్రత్యేక కోర్టుకు సీబీఐ మంగళవారం తెలిపింది.

2జీ స్పెక్ట్రం అడ్డగోలు కేటాయింపుల వ్యవహారంలో రిలయన్స్ అడాగ్ ప్రమేయంపై ఆ కంపెనీ అధికారులను ప్రశ్నించినా సరైన సమాధానం రాలేదని న్యాయస్థానానికి సీబీఐ విన్నవించింది. అందువల్లే అనిల్, టీనా అంబానీలను సాక్షులుగా విచారించాలనుకుంటున్నామని వెల్లడించింది.

స్వాన్ టెలికం కంపెనీలోని షేర్లను మారిషస్‌కు చెందిన డెల్ఫీ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ కొనుగోలు వ్యవహారంలో అనిల్ అంబానీ సహా.. అడాగ్ ఉద్యోగులను సీబీఐ విచారిస్తోంది. 2జీ స్పెక్ట్రమ్ లైసెన్స్ పొందిన స్వాన్ టెలికం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ లేదా ఆర్‌కామ్‌కు ముసుగు సంస్థగా పని చేసినట్లు కాగ్ తన నివేదికలో పేర్కొన్న విషయం తెలిసిందే.

స్వాన్ టెలికంలో ఆర్‌కామ్‌కు 10.71 శాతం వాటా ఉన్నట్లు కాగ్ అంచనా వేసింది. 2008 జనవరిలో స్వాన్‌లోని తన షేర్లను ఆర్‌కామ్ అమ్మేసింది. అయితే.. స్వాన్ టెలికం నుంచి అనిల్ అంబానీ ఎందుకు వైదొలిగారనే దానిపై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది.

మరిన్ని వార్తలు