హస్తినలో ప్రచారానికి తెర

3 Dec, 2013 02:38 IST|Sakshi
హస్తినలో ప్రచారానికి తెర

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచారపర్వానికి తెరపడింది. హోరాహోరీగా నేతల విమర్శలు, ప్రతివిమర్శలతో కొనసాగిన సందడి సద్దుమణిగింది. పోలింగ్ బుధవారం జరగనుండగా, ఎన్నికల కమిషన్ పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల (ఆప్) మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఈ ఎన్నికలతోనే అరంగేట్రం చేస్తున్న ‘ఆప్’ విజయావకాశాలు ఎలా ఉన్నా, ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ముచ్చెమటలు పట్టించగలిగింది.

ప్రచార గడువు ముగియడంతో వివిధ పార్టీల అభ్యర్థులు తెరవెనుక ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేయకుండా చూసేందుకు ఎన్నికల కమిషన్ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. ఓటర్లను ప్రలోభపెట్టే యత్నాలు చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలపై ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ల కింద కేసులు పెడతామని, అభ్యర్థులు, రాజకీయ పార్టీల నుంచి నగదు, మద్యం తదితర తాయిలాలు తీసుకునే ఓటర్లపై కూడా కేసులు పెడతామని ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి విజయ్ దేవ్ సోమవారం హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్, హర్యానా సరిహద్దులతో పాటు ఢిల్లీలోని మురికివాడలు, అనధికారిక కాలనీలపై గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ రోజు ఢిల్లీలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తామని, అనవసరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రాకపోకలు సాగించే వారు గుర్తింపు కార్డులతో ఉండటం మంచిదని సూచించారు. ఢిల్లీలోని 630 పోలింగ్ కేంద్రాలు, 11,753 పోలింగ్ బూత్‌లను ఉద్రిక్తతలకు దారితీసే అవకాశాలు ఉన్నవిగా గుర్తించినట్లు చెప్పారు. అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఉండేందుకు 64 వేల మంది ఢిల్లీ పోలీసులతో పాటు 107 కంపెనీల కేంద్ర పారా మిలటరీ బలగాలను నియమించినట్లు వెల్లడించారు.

ఎక్కడికక్కడ నిఘా కెమెరాలను, వీడియో నిఘా బృందాలను, ఫ్లైయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఢిల్లీ బరిలో సంపన్న అభ్యర్థులు పెద్దసంఖ్యలో బరిలో ఉండటంతో ఎన్నికల కమిషన్ ప్రధానంగా వారిపై డేగకన్ను వేసి ఉంచింది. ఎన్నికల ప్రచార వ్యయ పరిమితిని ఎన్నికల కమిషన్ రూ.14 లక్షలుగా నిర్ధారించగా, సంపన్న అభ్యర్థులు ఈ పరిమితిని అధిగమించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఒకవేళ అభ్యర్థుల్లో ఎవరైనా, ఈ పరిమితిని దాటితే వారిపై అనర్హత వేటు తప్పదని ఎన్నికల కమిషన్ హెచ్చరించింది. అయితే, సోషల్ మీడియాలో సాగే ప్రచారాన్ని పర్యవేక్షించడంలో పలు లోపాలు ఉన్నాయని ఈసీ అంగీకరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియాలో ప్రచారాన్ని నియంత్రించడం అసాధ్యమని తేల్చి చెప్పింది.
 
 ఢిల్లీలోనే అత్యధికంగా ‘కోడ్’ ఉల్లంఘనలు
 ఈ ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా, ఢిల్లీలోనే అత్యధికంగా ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘనలు జరిగినట్లు ఎన్నికల కమిషన్ అధికారి ఒకరు వెల్లడించారు. ‘కోడ్’ ఉల్లంఘనలకు సంబంధించి వివిధ పార్టీలపై 346 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి విజయ్ దేవ్ చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీపై అత్యధికంగా 105 ఎఫ్‌ఐఆర్‌లు నమోదవగా, కాంగ్రెస్‌పై 88, బీజేపీపై 86, బీఎస్పీపై27 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు తెలిపారు.
 
 బరిలో 265 మంది కోటీశ్వరులు
 ఢిల్లీ బరిలో ఈసారి మొత్తం 796 మంది పోటీ చేస్తుండగా, వారిలో 265 (33 శాతం) మంది కోటీశ్వరులు, మరో 129 (16 శాతం) మంది నేరచరితులు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 790 మంది పోటీ చేయగా, 111 (14 శాతం) నేరచరితులు ఉన్నారు. గత 2008 ఎన్నికల్లో గెలుపొంది, ఈసారి తిరిగి పోటీ చేస్తున్న సిటింగ్ ఎమ్మెల్యేల సగటు ఆస్తులు రూ.2.90 కోట్ల నుంచి రూ.10.43 కోట్లకు (259 శాతం) పెరిగాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల సగటు ఆస్తులు రూ.3.43 కోట్ల మేరకు ఉన్నాయి. కాగా, కాంగ్రెస్ అభ్యర్థుల్లోనే కోటీశ్వరులు ఎక్కువగా ఉన్నారు. కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న మొత్తం 70 మంది అభ్యర్థుల్లో 61 మంది కోట్లకు పడగలెత్తిన వారే. బీజేపీ అభ్యర్థుల్లో 58 మంది, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల్లో 33 మంది కోటీశ్వరులు ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఆస్తులు 2008 ఎన్నికల నాటికి రూ.1.30 కోట్లు ఉండగా, ప్రస్తుతం రూ.2.81 కోట్లకు (116 శాతం) పెరిగాయి.

బీజేపీ సీఎం అభ్యర్థి హర్షవర్ధన్ ఆస్తుల విషయంలో షీలాకు సమ ఉజ్జీగానే ఉన్నారు. గత ఎన్నికల నాటికి ఆయన ఆస్తులు రూ.1.74 కోట్లు కాగా, ఈసారి రూ.2.81 కోట్లకు పెరిగాయి. కాంగ్రెస్ అభ్యర్థుల సగటు ఆస్తులు రూ.14.25 కోట్లు, బీజేపీ అభ్యర్థుల సగటు ఆస్తులు 8.16 కోట్లు కాగా, ‘ఆప్’ అభ్యర్థుల సగటు ఆస్తులు రూ.2.51 కోట్లు. అయితే, ఈసారి పోటీ చేస్తున్న అత్యంత సంపన్న అభ్యర్థి బీజేపీ మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్‌కు చెందిన మన్‌జీందర్ సింగ్ కావడం గమనార్హం. రాజౌరీ గార్డెన్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన తనకు రూ.235.51 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. ఈసారి మొత్తం 129 మంది నేరచరితులు పోటీ చేస్తుండగా, వారిలో 93 మందిపై హత్యాయత్నం, దోపిడీ వంటి తీవ్రమైన నేరాలకు సంబంధించిన అభియోగాలు ఉన్నాయి.
 

మరిన్ని వార్తలు