తెలంగాణ, సీమాంధ్ర నేతల సమావేశాలు

18 Nov, 2013 12:51 IST|Sakshi

న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన కసరత్తు చివరి దశకు చేరుకోవటంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి దేశ రాజధాని చుట్టూ తిరుగుతున్నాయి. జీవోఎంతో  భేటీ నేపథ్యంలో ఓ వైపు తెలంగాణ ప్రాంత నేతలు, మరోవైపు సీమాంధ్ర ప్రాంత నేతలు విడివిడిగా సమావేశం అయ్యారు.  ఈరోజు ఉదయం సీమాంధ్ర కేంద్ర మంత్రులు జీవోఎం ఎదుట హాజరుకావాల్సిన నేపథ్యంలో.. దానికి ముందుగా కేంద్రమంత్రి పళ్లంరాజు నివాసంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులతో పాటు అందుబాటులో ఉన్న రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు అల్పాహార విందు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.

 ప్రధానంగా హైదరాబాద్, సాగునీటి వనరుల పంపకం, నూతన రాజధాని అభివృద్ధికి తగిన ఆర్థిక ప్యాకేజీ, ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటు వంటి అంశాలను.. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం ముందు ఉంచాలని భావిస్తున్నారు. ఉదయం 11.30 గంటలకు జీవోఎంతో సీమాంధ్ర కేంద్ర మంత్రులు భేటీ కానున్నారు.

మరోవైపు తెలంగాణ ప్రాంత కేంద్ర మంత్రులు, నేతలు కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి నివాసంలో ఈరోజు ఉదయం మరోసారి సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రాంత నేతలు ఉదయం 10.30 గంటలకు జీవోఎంతో భేటీ కానున్నారు. ఇక ఈరోజు ఉదయం ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 12.30 గంటలకు జీవోఎం సభ్యులను కలుస్తారు.
 

మరిన్ని వార్తలు