ప్రేయసి కోసం జిమ్‌ ట్రైనర్‌ మాస్టర్‌ప్లాన్‌

10 Jan, 2017 10:41 IST|Sakshi
ప్రేయసి కోసం జిమ్‌ ట్రైనర్‌ మాస్టర్‌ప్లాన్‌

ఢిల్లీ: డిగ్రీ వరకూ కలిసి చదువుకున్న ఆ ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కానీ విడివిడిగా వేరేవాళ్లతో పెళ్లిళ్లయ్యాయి. జిమ్‌ ట్రైనర్‌గా సెటిల్‌ అయిన ఆ ప్రేమికుడు.. అటు ప్రేయసిని మర్చిపోలేక, ఇటు భార్యతో సౌఖ్యంగా ఉండలేక సతమతమయ్యాడు. ఎలాగోలా భార్యను వదిలించుకుని, ప్రేయసిని దక్కించుకునేందుకు మాస్టర్‌ప్లాన్‌ వేశాడు. రెండో ప్రపంచ యుద్ధం, కోల్డ్‌వార్‌ సమయాల్లో జరిగిన హత్యోదంతాలను ఇంటర్నెట్‌లో చదివాడు. చివరికి, 1978నాటి లండన్‌ ‘గొడుగు హత్య’(Umbrella Murder) తరహాలో ప్రేయసి భర్తను హత్య చేయించాలనుకున్నాడు. ఇందుకోసం లక్షలు పోసి ఓ ప్రొఫెషనల్‌ కిల్లర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దేశరాజధాని ఢిల్లీలో సంచలనం రేపిన ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలను డీసీపీ(నార్త్‌ ఢిల్లీ) జతిన్‌ నర్వాల్‌ మీడియాకు వెల్లడించారు.

సదర్‌ బజార్‌లో నివసించే రవి కుమార్‌(27) అనే వ్యక్తి కోటక్‌ మహీంద్రా బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్నేళ్ల కిందట అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని పెళ్లిచేసుకున్నాడు. శనివారం సాయంత్రం సినిమాకు వెళ్లిన రవి కుమార్‌కు మెడ మీద ఏదో గుచ్చుకున్నట్లైంది. అతణ్ని ఫాలో అవుతూవచ్చి, వెనుక సీటులో కూర్చున్న హంతకుడు.. రవికుమార్‌ మెడలోకి విషాన్ని ఇంజెక్ట్‌ చేశాడు. విష ప్రభావంతో స్పృహ కోల్పోతూ, రక్తం కారుతున్న స్థితిలోనూ రవి కుమార్‌ హంతకుణ్ని దొరకబుచ్చుకునే ప్రయత్నం చేశాడు. ఇదంతా గమనించిన చుట్టుపక్కలవాళ్లు హంతకుణ్ని పట్టుకుని, రవి కుమార్‌ను ఆసుపత్రికి తరలించారు. ఇంజెక్ట్‌ చేసింది అత్యంత ప్రమాదకరమైన విషం కావడంతో చికిత్స పనిచేయలేదు. ఆదివారం తెల్లవారుజామున రవికుమార్‌ ప్రాణాలు విడిచాడు.

హంతకుణ్ని ప్రొఫెషనల్‌ కిల్లర్‌ ప్రేమ్‌గా గుర్తించిన పోలీసులు తమదైన శైలిలో ఇంటరాగేట్‌చేయగా అసలు విషయం బయటపడింది. జిమ్‌ ట్రైనర్‌గా పనిచేసే అనీశ్‌ యాదవ్‌.. హతుడు రవికుమార్‌ భార్య గతంలో ప్రేమికులు. కొన్ని కారణాల వల్ల విడిపోయి, వేరువేరు పెళ్లిళ్లు చేసుకున్నారు. కొద్ది రోజుల కిందటే భార్యను వదిలేసిన అనీశ్‌.. ఎలాగైనాసరే ప్రేయసిని దక్కించుకోవాలనుకున్నాడు. అందుకు అడ్డుగా ఉన్న ఆమె భర్త(రవికుమార్‌)ను అంతం చేయాలనుకున్నాడు. ఆ మేరకు ప్లాన్‌గీసి, ప్రేమ్‌ అనే హంతకుడికి రూ.1.5 లక్షలు చెల్లించి హత్య చేయించాడు. కాగా, రవికుమార్‌ హత్యోదంతంలో ఆయన భార్య ప్రమేయం కూడా ఉందా? అనే విషయం ఇప్పుడే చెప్పలేమని డీసీపీ జతిన్‌ నర్వాల్‌ అన్నారు. విచారణకు హాజరుకావాల్సిందిగా ఆమెకు నోటీసులు ఇచ్చామని, పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో తెలుస్తాయని తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులను రిమాండ్‌కు తరలించారు.

‘గొడుగు హత్య’
ప్రఖ్యాత వార్తా సంస్థ బీబీసీలో రిపోర్టర్‌గా పనిచేసిన గార్గ్‌ మార్కోవ్‌ అనే జర్నలిస్టు 1978లో దారుణ హత్యకు గురయ్యారు. లండన్‌ వీధుల్లో నడుచుకుంటూ వెళుతోన్న గార్డ్‌ను ఎదురుగా వచ్చిన హంతకుడు గొడుగుతో పొడిచాడు. గొడుగు ముందు భాగానికి ప్రమాదకరమైన విషం పూసి ఉండటంతో గార్గ్‌ నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయాడు. అప్పట్లో ఇది ‘గొడుగు హత్య’(Umbrella Murder)గా ప్రాచుర్యం పొందింది. 2011లో హానోవర్‌(జర్మనీ)లోనూ ఇదే తరహాలో ఓ హత్య జరిగింది. కాగా, ఈ రెండు సందర్భాల్లోనూ హంతకుడు ఎవరు? ఎందుకు హత్య చేశారు అనేవి ఇప్పటికీ మిస్టరీలే!


పోలీసుల అదుపులో ప్రొఫెషనల్‌ కిల్లర్‌ ప్రేమ్‌, మూల కారకుడు అనీశ్‌ యాదవ్‌(జిమ్‌ ట్రైనర్‌)

మరిన్ని వార్తలు