‘బీమా’కు డీఎల్‌ఎఫ్ గుడ్‌బై

26 Jul, 2013 03:48 IST|Sakshi
DLF

 న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్ జీవిత బీమా వ్యాపారానికి గుడ్‌బై చెప్పింది. డీఎల్‌ఎఫ్ ప్రామెరికా లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలో తనకున్న 74 శాతం వాటాలను దివాన్ హౌసింగ్ ఫైనాన్స్‌కు విక్రయించింది. ఇందుకు సంబంధించి ఇరువురి మధ్యా ఒప్పందాలు కుదిరినట్లు సంస్థ తెలిపింది. ఈ డీల్ విలువ వెల్లడించకపోయినప్పటికీ... సుమారు రూ. 350-400 కోట్లు ఉంటుందని సంబంధిత వర్గాలు తెలియజేశాయి. రియల్ ఎస్టేట్‌ను ప్రధాన వ్యాపారంగా భావిస్తున్న డీఎల్‌ఎఫ్... అది తప్ప మిగిలిన వ్యాపారాల నుంచి క్రమంగా వైదొలగాలన్న తమ వ్యూహానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎల్‌ఎఫ్ గ్రూప్ సీఎఫ్‌వో అశోక్ త్యాగి తెలిపారు. అన్ని అనుమతులు లభించాకే డీల్ విలువ వెల్లడించగలమని సంస్థ వివరించింది.
 
 నాలుగున్నరేళ్ల క్రితం కార్యకలాపాలు ప్రారంభించిన... డీఎల్‌ఎఫ్ ప్రామెరికా లైఫ్ ఇన్సూరెన్స్‌లో డీఎల్‌ఎఫ్‌కి 74 శాతం, అమెరికన్ కంపెనీకి అనుబంధ సంస్థ అయిన ప్రుడెన్షియల్ ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్‌కి 26 శాతం వాటాలున్నాయి. ఇది 2011-12లో రూ. 128 కోట్లు, 2012-13లో రూ.132 కోట్లు నష్టాలు నమోదు చేసింది. ప్రస్తుతం దీనికి  దేశవ్యాప్తంగా 5,487 మంది ఏజంట్లు, 55 శాఖలు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 1,02,418 కొత్త పాలసీలు విక్రయించగా.. వాటిపై రూ. 139 కోట్ల ప్రీమియం ఆదాయం నమోదు చేసింది.
 
 కొనుగోలు ప్రక్రియ ముగిశాక బీమా కంపెనీ పేరును డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రామెరికా లైఫ్ ఇన్సూరెన్స్‌గా మారుస్తారు. జాయింట్ వెంచర్ సంస్థ ఇకపై కూడా ప్రస్తుత యాజమాన్యంలోనే కొనసాగుతుందని డీహెచ్‌ఎఫ్‌ఎల్ తెలిపింది. తమ కస్టమర్లకు వైవిధ్యమైన సర్వీసులందించేందుకు ఈ డీల్ ఉపయోగపడగలదని సంస్థ సీఎండీ కపిల్ వాధ్వాన్ తెలిపారు. రియల్టీపై దృష్టి నిలిపేందుకు వీలుగా ఇప్పటికే పవన విద్యుత్ రంగం నుంచి వైదొలిగిన డీఎల్‌ఎఫ్.. లగ్జరీ హాస్పిటాలిటీ సంస్థ అమన్ రిసార్ట్స్ విక్రయానికి కూడా ఒప్పందం కుదుర్చుకుంది. గడిచిన మూడేళ్లలో ఇతర వ్యాపారాల్లో వాటాల విక్రయం ద్వారా సుమారు రూ. 10,000 కోట్లు సమీకరించింది.
 

మరిన్ని వార్తలు