అనారోగ్యంతో ఉన్న మాజీ భార్యపై..

30 Aug, 2016 20:42 IST|Sakshi
అనారోగ్యంతో ఉన్న మాజీ భార్యపై..

న్యూఢిల్లీ: మాజీ భార్యపై లైంగిక దాడి జరిపిన ఓ వ్యక్తి ఢిల్లీ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. తనపై మాజీ భార్త అఘాయిత్యాన్ని ధైర్యంగా వెల్లడించిన బాధితురాలు స్ఫూర్తిదాయకంగా నిలిచారని కోర్టు పేర్కొంది. దక్షిణ ఢిల్లీ వాసి అయిన దోషికి జైలుశిక్షతోపాటు రూ. 20వేల జరిమానా విధించింది. జరిమానాను బాధితురాలికి చెల్లించాలని ఆదేశించింది.

'ఆమె అనారోగ్యంతో బలహీనంగా ఉండటం వల్ల నిందితుడు బలాత్కారం చేసినా.. ప్రతిఘటించలేకపోయింది. ఈ విషయంలో బాధితురాలి వాంగ్మూలాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంటున్నది. అదేవిధంగా ప్రాసిక్యూషన్‌ నిందితుడిపై మోపిన అభియోగాలన్నిటినీ రుజువుచేయడంలో విజయవంతమైంది. కాబట్టి నిందితుడు ఐపీసీ సెక్షన్‌ 376 (రేప్‌) కింద శిక్షార్హమైన నేరానికి పాల్పడినట్టు కోర్టు నిర్ధారిస్తున్నది' అని అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి సంజీవ్‌ జైన్‌ తెలిపారు. 'బాధితురాలి ప్రైవేటు అంగాలపై ఎలాంటి గాయాలు లేనంతమాత్రాన.. ఇది లైంగిక దాడి నేరం కాబోదనడానికి లేదు' అని స్పష్టం చేశారు. 'ఘటన జరిగిన వెంటనే బాధితురాలు పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఫిర్యాదు నమోదు చేయడంలో ఎలాంటి జాప్యానికి పాల్పడలేదు. నిందితుడిపై ఈ కేసులో ఆమె స్థిరంగా వ్యవహరించింది' అని కోర్టు పేర్కొంది.

ప్రాసిక్యూషన్‌ ప్రకారం నిందితుడు 2013లో బాధితురాలిని పెళ్లి చేసుకున్నాడు. ఏడాది తర్వాత ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు. విడాకుల తర్వాత ఆమె వద్ద నుంచి రూ. 50వేలు తీసుకున్నాడు. ఈ డబ్బులు తిరిగి ఇవ్వమని అడుగడంతో ఆమె ఇంటికి వచ్చిన అతను.. ఇంట్లో ఒంటరిగా ఉండటం చూసి ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా లైంగిక చర్యకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 

మరిన్ని వార్తలు