ఢిల్లీలో అడుగుపెట్టగానే సీఎంను లేపేస్తా!

27 Oct, 2016 08:54 IST|Sakshi
ఢిల్లీలో అడుగుపెట్టగానే సీఎంను లేపేస్తా!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అడుగుపెట్టగానే ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను కాల్చిచంపేస్తానని ఓ గుర్తు తెలియని వ్యక్తి పోలీసు ఎమర్జెన్సీ నంబర్‌ 100కు ఫోన్‌ చేయడం తీవ్ర కలకలం రేపింది. కేజ్రీవాల్‌ రోడ్డుమార్గంలో చండీగఢ్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరిన సమయంలో ఈ బెదిరింపు ఫోన్‌కాల్‌ వచ్చింది.

దీంతో అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు చేయగా... ఇది ఉత్తుత్తి బెదిరింపు కాల్‌ని తేలింది. మద్యం తాగి.. మతిస్థిమితం సరిగ్గాలేని ఓ వ్యక్తి పోలీసులను భయపెట్టించేందుకు ఈ కాల్‌ చేసినట్టు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ‘బుధవారం సాయంత్రం 6.16 గంటల సమయంలో పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు ఓ బెదిరింపు కాల్‌ వచ్చింది. తర్వాత ఇది ఉత్తిదేనని తేలింది. ఈశాన్య ఢిల్లీ ఖజురీ ఖాస్‌ ప్రాంతానికి చెందిన రవీంద్రకుమార్‌ తివారీ అనే వ్యక్తి ఈ కాల్‌ చేసినట్టు గుర్తించాం. దీంతో అతని ఇంటికి వెళ్లి పోలీసులు విచారణ జరిపారు. అతను మద్యం తాగి.. మతి స్థిమితం లేని స్థితిలో ఉన్నాడని స్థానికులు చెప్పారు. అతను ఇంకా పరారీలో ఉన్నాడు’ అని సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. సీఎం కేజ్రీవాల్‌ను కాల్చిచంపుతానని కాల్‌ చేసి బెదిరించిన తివారీని.. నీ వివరాలు తెలుపమని పోలీసులు అడగగా.. ‘నన్ను చంపేస్తేనే నా వివరాలు తెలుపుతా’ అని పేర్కొన్నట్టు ఆ అధికారి తెలిపారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా సీఎం కార్యాలయానికి ఈ బెదిరింపు కాల్‌ వివరాలను తెలిపినట్టు ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు