ప్రజాస్వామ్యమే ఎజెండా

7 Nov, 2015 02:09 IST|Sakshi
ప్రజాస్వామ్యమే ఎజెండా

 సెంట్రల్ డెస్క్ : ఇప్పుడు ప్రపంచం దృష్టి అంతా మయన్మార్ పైనే. ఆదివారం జరిగే సార్వత్రిక ఎన్నికలతో అక్కడి ప్రజాస్వామ్యం భవిష్యత్తు తేలనుంది. మిలటరీ సహకారంతో నడిచే.. అధికార యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్‌మెంట్ పార్టీ (యూఎస్‌డీపీ), విపక్ష ఎన్‌ఎల్‌డీలు హోరాహోరీ ప్రచారం చేస్తున్నాయి. బౌద్ధులు మెజారిటీగా ఉండే మయన్మార్‌లో మైనారిటీలపై దాడులు, అంతర్జాతీయ హక్కుల సంఘాల ఆందోళన నేపథ్యంలో 25 ఏళ్ల తర్వాత తొలిసారి పారదర్శకంగా జరుగుతున్న ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. 1990లో చివరి సారిగా.. జరిగిన పారదర్శక ఎన్నికల్లో సూచీ నాయకత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్‌ఎల్‌డీ) భారీ మెజారిటీతో గెలిచినా.. మిలటరీ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించేందుకు నిరాకరించటంతో పాటు సూచీని గృహనిర్బంధంలో పెట్టింది. ప్రజాస్వామ్యం అమలుకు అంతర్జాతీయ ఒత్తిళ్లు.. సూచీ గృహ నిర్బంధం నుంచి విముక్తి నేపథ్యంలో.. ఈ ఎన్నికలు స్థానిక ప్రభుత్వానికి కూడా ప్రతిష్ఠాత్మకంగా మారాయి.

 ప్రెసిడెంట్ ఎవరవుతారు?
 మయన్మార్ జాతీయ, ప్రాంతీయ, రాష్ట్ర  పార్లమెంట్లలో ఉండే 1,142 సీట్లకోసం 93 పార్టీలనుంచి 6వేలకు పైగా అభ్యర్థులు బరిలో ఉన్నారు. జాతీయ పార్లమెంటులోని 600 సీట్లలో 25 శాతం మిలటరీ ప్రతినిధులవే. ఎన్ని పార్టీలున్నా.. యూఎస్‌డీపీ, ఎన్‌ఎల్‌డీ మధ్యే తీవ్రమైన పోటీ ఉంది. మయన్మార్‌లో అధ్యక్షుడే రాజ్యాంగ అధినేత. అయితే దేశ రాజ్యాంగం ప్రకారం.. భార్య లేదా భర్త విదేశీయులైనా లేదా సంతానానికి మయన్మార్ పౌరసత్వం లేకపోయినా.. ఆ వ్యక్తి అధ్యక్ష పదవిని అధిరోహించేందుకు అర్హత ఉండదు.

ఈ నిబంధన ప్రకారం ఎన్‌ఎల్‌డీకి విజయావకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నా.. సూచీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యే అవకాశం లేదు. ఎందుకంటే సూచీ.. ఓ బ్రిటిష్ వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆమె ఇద్దరు పిల్లలూ బ్రిటన్ పాస్‌పోర్టులు కలిగి ఉన్నారు. అయితే.. అధ్యక్ష స్థానంలో ఎవరినైనా కూర్చోబెట్టి.. మొత్తం పాలన తానే చూస్తానని సూచీ చెబుతున్నారు. సూచీని అధ్యక్షురాలిగా ఎన్నుకునేందుకు రాజ్యాంగంలో మార్పులు చేయాలంటే.. సభలో కనీస మెజారిటీతోపాటు మిలటరీ పాలకుల్లో కనీసం ఒకరైనా రాజ్యాంగంలోని సదరు నిబంధనల మార్పుకు ఆమోదం తెలపాలి. దీంతో రాజ్యాంగంలో మార్పు సాధ్యమా అనేది ప్రశ్నార్థకమే.

 పరిస్థితి ఏమైనా మారుతుందా..? ఎన్నికల్లో ఎవరు గెలిచినా పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్‌ఎల్‌డీ పగ్గాలు చేపట్టినా.. పాలనలో అధికార యూఎస్‌డీపీ, మిలటరీ ప్రభావం ఎక్కువగానే ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ప్రజలు మాత్రం.. వ్యవస్థ, రాజకీయాలు మారినా మారకపోయినా.. తమ జీవితాల్లో మాత్రం మార్పు రావాల్సిందే నంటున్నారు.

మరిన్ని వార్తలు