నోట్ల రద్దుపై పాశ్చాత్య మీడియా ఏమంటోందంటే..

16 Nov, 2016 17:11 IST|Sakshi

రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన నాటి నుంచి స్ధానిక మీడియా దానిపై విస్తృతంగా రిపోర్టింగ్ చేస్తోంది. పాకిస్తాన్ కు చెందిన కొన్ని న్యూస్ ఏజెన్సీలు కూడా మోదీ తీసుకున్న నిర్ణయాన్ని పొగుడుతూ చర్చిస్తున్నాయి. దీంతో నోట్ల రద్దు విషయంపై విదేశీ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కాలమ్స్ ప్రచురితమయ్యాయి.

ది వాషింగ్టన్ పోస్టు

నల్లధనంపై పోరులో భాగంగానే భారత ప్రధానమంత్రి పెద్ద నోట్లను రద్దు చేశారని వాషింగ్టన్ పోస్టు పేర్కొంది. దేశం ఆర్ధికంగా ఎదగడానికి, విదేశీ పెట్టుబడులను పెద్ద ఎత్తున రాబట్టడానికే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. గతంలో నల్లధనాన్ని తమంతట తామే వెల్లడించాలని ప్రజలను భారత ప్రభుత్వం కోరింది. దీని ద్వారా 19 బిలియన్ డాలర్లు నల్లధనాన్ని భారతీయులు వెల్లడించారు. భారత్ లో మొత్తం 1 ట్రిలియన్ డాలర్ల నల్లధనం ఉందని వాషింగ్టన్ పోస్టు తెలిపింది.

సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్

పన్ను ఎగవేత దారులపై చర్యలు తీసుకుంటామని తన ఎన్నికల ప్రచారంలో చెప్పిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అందులో భాగంగానే పెద్ద నోట్లను రద్దు చేశారని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పేర్కొంది. నల్లధన ప్రవాహాలను అడ్డుకునేందుకు యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు 500 యూరోనోట్లను రద్దు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. 

ది ఇండిపెండెంట్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం ఆయనకు ప్రజల్లో ఉన్న గౌరవాన్ని మరింత పెంచిందని నాయకులు ఫీలవుతున్నారని చెప్పింది. భారత ప్రభుత్వానికి చెందిన ఓ సీనియర్ అధికారి మోదీని సింగపూర్ మొదటి ప్రధానమంత్రి లీ కువాన్ యేవ్ తో పోల్చారని పేర్కొంది. గత ఏడాది లీ మరణానంతరం ఆయనపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. నాయకుల్లో లీ కువాన్ యేవ్ సింహంలాంటి వారని ఆయన అ‍న్నారు.

న్యూయార్క్ టైమ్స్

నోట్ల రద్దు విషయాన్ని మోదీ ప్రకటించే వరకూ రహస్యంగా ఉంచారని పేర్కొంది. మోదీ చారిత్రాత్మక నిర్ణయంతో భారత్ దశ, దిశలు మారిపోతాయని ఆర్ధిక రంగ నిపుణులు అంటున్నారని చెప్పింది. 

వాల్ స్ట్రీట్ జర్నల్

మోదీ తీసుకున్న నిర్ణయం విజయవంతమైతే ప్రభుత్వ ట్యాక్స్ చెల్లింపులు భారీగా పెరుగుతాయని చెప్పింది. మోదీ నిర్ణయం తర్వాత పెద్ద సంఖ్యలో పెట్టుబడిదారులు భారతీయ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. ఇది మోదీ తీసుకున్న నిర్ణయం సఫలీకృతమౌతోందన్న విషయాన్ని సూచిస్తోందని పేర్కొంది.

మరిన్ని వార్తలు