ఐటీకి చిక్కిన రూ.100 కోట్ల నల్లధనం

12 Nov, 2016 14:22 IST|Sakshi
ఐటీకి చిక్కిన రూ.100 కోట్ల నల్లధనం
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుతో భారీ మొత్తంలో నల్లధనం గుట్టురట్టవుతోంది. రూ.100కోట్ల  విలువైన లెక్కలో చూపించని నగదును, విక్రయాలను ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది.  ఐటీ శాఖ సర్వే ఆపరేషన్స్ విస్తరణలో భాగంగా పన్ను ఎగవేసిన వర్తకుల నుంచి, ఇతర ఆపరేటర్ల దగ్గర్నుంచి ఈ నగదును ఐటీ శాఖ బయటికి రాబట్టింది. ఢిల్లీ, బెంగళూరు, కోల్కత్తా, ముంబాయి నగరాల్లో ట్రేడ్ కౌంటర్స్, దుకాణాల్లో ఐటీ డిపార్ట్మెంట్ ఈ సర్వే ఆపరేషన్ చేపట్టింది.
 
అత్యధిక మొత్తంలో నగదు, సేల్స్ డాక్యుమెంట్లు ఈ ప్రాంతాల్లో బయటపడ్డట్టు ఐటీ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. నోట్ల రద్దుతో వర్తకులు అక్రమంగా విక్రయాలు జరుపుతున్నారని, ఆ విలువ రూ.100 కోట్లగా ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులపై విచారిస్తున్నామని, వర్తకులు నిర్ధేశించిన సమయం లోపల తమ వివరణ ఇచ్చుకోవాలని ఆదేశించింది. అదేవిధంగా కొన్ని విక్రయ రికార్డులను తాము స్వాదీనం పర్చుకున్నామని పేర్కొన్నారు.
 
కొంతమంది వర్తకులు, జ్యువెల్లరీ, కరెన్సీ ఎక్స్చేంజ్  ఏజెంట్స్, హవాలా డీలర్స్ డిస్కౌంట్ ధరలకు రూ.500, రూ.1,000 నోట్లను మారుస్తున్నారని తెలుసుకున్న ఐటీ డిపార్ట్మెంట్ ఈ రైడ్స్ జరుపుతోంది.  అదేవిధంగా ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఓ ప్రయాణికుడు రద్దు చేసిన పెద్ద నోట్లను రూ.50 లక్షల మేర తరలిస్తుండగా టాక్స్ డిపార్ట్మెంట్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ యూనిట్ గుట్టురట్టు చేసింది.
ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో నగదు తరలింపులపై పారామిలటరీ బలగాలు, పోలీసులు ఓ కన్నేసి ఉండాలని, ముఖ్యంగా సివిల్ ఎయిర్పోర్ట్స్, ఢిల్లీ మెట్రో, రైల్వే స్టేషన్లు, బస్స్టేషన్లలో రద్దుచేసిన 500, 1000 రూపాయల నోట్ల తరలింపుకు అడ్డుకట్టు వేయాలని ఆర్థికమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది.  సర్వే యాక్షన్లో భాగంగా పన్ను అధికారులు ట్రేడ్, ఆపరేటర్ల బిజినెస్ ప్రాంతాలలో రైడ్స్ నిర్వహిస్తున్నారు.
మరిన్ని వార్తలు