నగదు కొరత: మానవత్వం చాటుకున్న ఊరిజనం

24 Dec, 2016 13:12 IST|Sakshi
పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల్లో విధించిన పరిమితులకు ఓ సీనియర్ సిటిజన్కు తన భార్య అంత్యక్రియలు నిర్వహించడానికి డబ్బులు దొరకని పరిస్థితి నెలకొంది. బ్యాంకు వారు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో ఊరిజనమే విరాళాల రూపాలుగా నగదు సేకరించి ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే.... జ్యుయర్ కాజూర్ జార్ఖాండ్లోని లాతేహార్ జిల్లా బ్రిష్ రాంపుర్కు చెందిన ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. గురువారం ఉదయం తన భార్య హీరామని కాజూర్ మరణించడంతో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించడానికి రూ.10వేల అవసరం పడ్డాయి. తన అకౌంట్లో ఉన్న నగదును విత్డ్రా చేసుకోవడానికి మేనల్లుడితో కలిసి స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా శాఖకు వెళ్లాడు. అయితే కాజూర్ అడిగిన మొత్తాన్ని ఇవ్వడానికి క్యాషియర్ నిరాకరించారు.
 
మొత్తం పరిస్థితిని వివరించినప్పటికీ, ఆయన రూ.4000 కంటే అధికంగా ఇ‍వ్వడానికి ఒప్పుకోలేదు. కాజూర్కు మరో అవకాశం లేకపోవడంతో ఇచ్చిన నగదుని తీసుకుని ఇంటికొచ్చాడు. బ్యాంకుల్లో జరిగిన పరిస్థితినంతా గ్రామస్తులకు వివరించాడు. కాజూర్ బాధను చూసి చలించిపోయిన స్థానికులు తమకు తోచినంతా సాయంగా అందించి అతని భార్యకు అంత్యక్రియలు నిర్వహించారు. వారి వద్ద నగదు తక్కువున్నప్పటికీ, తన భార్య అంత్యక్రియలకు సాయంగా ముందుకు వచ్చి, కార్యక్రమం నిర్వహించారని, గ్రామస్తులందరికీ తాను రుణపడి ఉంటానని తెలిపాడు. తమ అవసరాలకు కూడా తీసుకోవడానికి పనికి రాని నగదును బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్ చేయడమెందుకని అతను ఆవేదన వ్యక్తంచేశాడు. తనకు నగదు అందిన వెంటనే గ్రామస్తులకు చెల్లిస్తానని మాటిచ్చాడు. కాజూర్, పాలమూ జిల్లాలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్మెంట్ పొందాడు.    
Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు