నోట్ల రద్దు భారత్‌కు మంచిదే: ప్రపంచబ్యాంకు

3 Mar, 2017 10:45 IST|Sakshi
నోట్ల రద్దు భారత్‌కు మంచిదే: ప్రపంచబ్యాంకు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపిస్తుందని, దానివల్ల అవినీతి కూడా అంతం అవుతుందని ప్రపంచ బ్యాంకు సీఈవో క్రిస్టలీనా జార్జియెవా అన్నారు. ఎక్కువగా నగదుతో కూడిన ఆర్థికవ్యవస్థలో ఉంటున్న ప్రజలకు పెద్దనోట్ల రద్దు వల్ల కొన్ని కష్టాలు ఎదురై ఉండచ్చని, అయితే దీర్ఘకాలంలో మాత్రం దీనివల్ల స్వచ్ఛమైన, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ సాధ్యమవుతుందని అన్నారు. భారతదేశం చేసిన ప్రయోగాన్ని ఇతర దేశాలు గమనిస్తున్నాయని, ఇంత పెద్ద దేశంలో ఎప్పుడూ ఇలా నోట్లను రద్దు చేయలేదని ఆమె చెప్పారు.
 
భారతదేశంలో 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడం వల్ల నెలల తరబడి డబ్బులు అందుబాటులో లేక ప్రజలు తీవ్ర కష్టాల పాలవ్వాల్సి వచ్చింది. అయితే దానివల్ల దేశంలో అవినీతి గణనీయంగా తగ్గుతుందని జార్జియెవా అన్నారు.  యూరోపియన్ యూనియన్ కూడా క్రమంగా పెద్దనోట్లను రద్దు చేయాలని ప్రయత్నిస్తోందని, అయితే వాళ్లు ఒక్కసారిగా కాకుండా దీర్ఘకాలంలో దశలవారీగా చేస్తారని ఆమె చెప్పారు. వ్యాపారాలపై కూడా కొంత కాలం పాటు నోట్ల రద్దు వల్ల ప్రతికూల ప్రభావం కనిపించిందని, దీర్ఘకాలంలో మాత్రం భారతదేశం చేపట్టిన ఈ సంస్కరణలు మంచి ప్రభావాన్ని చూపిస్తాయని తెలిపారు. 
 
రెండు రోజుల పర్యటన కోసం భారతదేశానికి వచ్చిన జార్జియెవా.. ముంబైలో లోకల్ రైల్లో ప్రయాణించడమే కాక, ప్రపంచంలోనే అతిపెద్ద మురికివాడ అయిన ధారవిలో కూడా పర్యటించారు. మెరుగైన జీవితం కోసం ప్రజలు చాలా ఆతృతగా ఉన్నారని, మెరుగైన సేవల కోసం ఎంతైనా చెల్లించడానికి సిద్ధంగా కనపడుతున్నారని ఆమె అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను మెరుగు పరుచుకోడానికి రాష్ట్రాల మధ్య పోటీ కూడా ఆరోగ్యకరంగా ఉందని ప్రశంసించారు. భారతదేశంలో ఈసారి వృద్ధిరేటు 7 శాతం ఉండొచ్చని తాము భావిస్తున్నామని, జీఎస్టీ అమలైతే ఆర్థికవృద్ధి మరింత వేగంగా ఉంటుందని తెలిపారు. 
మరిన్ని వార్తలు