డెంగీ వీరంగం!

16 Sep, 2015 01:29 IST|Sakshi
డెంగీ వీరంగం!

* ఆరోగ్యశ్రీ మాత్రం వర్తించదు..
* ‘ప్రైవేట్’ను ఒప్పించలేకపోతున్న సర్కారు
* ప్లేట్‌లెట్ల కోసం లక్షలు ఖర్చు చేస్తున్న బాధితులు
* రాజధాని సహా తెలంగాణ జిల్లాల్లో విజృంభిస్తోన్న డెంగీ, మలేరియా  
* 846 మందికి డెంగీ, 4,761 మందికి మలేరియా సోకినట్లు నిర్ధారణ
* ఈ సంఖ్య అంతకు ఐదింతలు పైనే ఉంటుందంటున్న వైద్యనిపుణులు
* డెంగీతో రాష్ట్రంలో ఇప్పటివరకు 50 మంది మరణించినట్లు అంచనా

 
 సాక్షి, హైదరాబాద్: రెక్కాడితేగానీ డొక్కాడని రాజయ్యకు జ్వరమొచ్చింది... సర్కారు దవాఖానాకు వెళితే ‘జ్వరం’ బిళ్లలు ఇచ్చి పంపారు.. అయినా తగ్గక ప్రైవేటు ఆస్పత్రికి వెళితే ‘డెంగీ’గా నిర్ధారించారు... ప్లేట్‌లెట్లు ఎక్కించాలన్నారు, వేల రూపాయలు ఖర్చవుతాయన్నారు.. ‘ఆరోగ్యశ్రీ’ కార్డు తీసి చూపితే అది పనికిరాదన్నారు.. రాజయ్య కుటుంబ సభ్యులు గొడ్డూగోదా అమ్మి, అప్పు చేసి 60 వేలు తెచ్చి ఆస్పత్రిలో కడితే.. ప్రాణాలతో బయట పడ్డాడు. పేదలను ఆదుకోవాల్సిన ‘ఆరోగ్యశ్రీ’ పనికిరాకుండా పోయింది.. ఒక్క జ్వరం ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. రాష్ట్రంలో డెంగీ విజృంభణ కారణంగా వందలాది మంది పేదలు, మధ్యతరగతి జీవుల దుస్థితి ఇది.
 
 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ‘డెంగీ’కి చికిత్స చేయరు. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లినా దీనికి ‘ఆరోగ్యశ్రీ’ వర్తించదు. రోజు రోజుకూ విజృంభిస్తూ పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డెంగీని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడంలో సర్కారు విఫలమైందన్న ఆరోపణలు వస్తున్నాయి. సాధారణ జ్వరాల మాదిరిగానే డెంగీ వస్తోందని, అందువల్ల దీన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం కష్టమన్న కొద్దిమంది అధికారుల అభిప్రాయం మేరకు ప్రభుత్వం దీన్ని పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.
 
 అంతా పేదలే..
 దోమలు స్వైర విహారం చేసే మురికివాడలు, గిరిజన పల్లెలు, పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండే ప్రాంతాల్లోనే ఎక్కువగా డెంగీ విజృంభిస్తోంది. అటువంటి ప్రాంతాల్లో ఉండేవారంతా దిగువ మధ్యతరగతి వారు, పేదలే. వీరి జీవితాలను డెంగీ పీల్చిపిప్పిచేస్తోంది. గత ఐదేళ్ల సర్కారు గణాంకాలను పరిశీలించినా... డెంగీ మరింతగా విస్తరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. 2011లో 520 డెంగీ కేసులు నమోదుకాగా.. ఈ సీజన్‌లో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 846 మందికి డెంగీ వచ్చింది. 4,761 మలేరియా కేసులు, 84 చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయి.
 
 అదే ప్రైవేటు వర్గాల అంచనా ప్రకారం రాష్ట్రంలో సుమారు 5 వేల మందికి డెంగీ, 20 వేల మందికి మలేరియా సోకినట్లు తెలుస్తోంది. డెంగీ కారణంగా ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోయి, వైద్యం చేయించుకోలేక 50 మంది వరకు మరణించినట్లు అంచనా. ఈ పరిస్థితిని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. సాధారణ చికిత్సతో నయం చేసే అవకాశాలున్నా ప్లేట్‌లె ట్ల సంఖ్య తగ్గిందంటూ వాటిని ఎక్కిస్తున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒక్కో ప్లేట్‌లెట్ ప్యాకెట్ ధర రూ.15 వేల వరకూ ఉంటోంది. ఒక్కో బాధితుడికి ఐదు నుంచి 20 వరకు కూడా ప్లేట్‌లెట్ ప్యాకెట్లు ఎక్కిస్తున్నారు. వారం పది రోజులు ఆసుపత్రిలో ఉంచుకొని చికిత్స చేసినందుకు మొత్తంగా రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేస్తూ పీల్చిపిప్పి చేస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు తమ వద్ద వసతులు లేవంటూ.. నిర్ధారణ పరీక్షలకు వీలులేదంటూ ప్రైవేటు ఆసుపత్రులకే పంపిస్తున్నాయి.
 
 తమకు నష్టమనే..!
 ఆరోగ్యశ్రీ పరిధిలో ప్రస్తుతం 938 వ్యాధులున్నాయి. ఆ జబ్బులకు అయ్యే ఖర్చును ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ప్యాకేజీ ప్రకారం సర్కారు చెల్లిస్తుంటుంది. అయితే డెంగీని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తే తమకు నష్టమని భావించిన ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు... దీనికి అనేక అడ్డంకులు సృష్టిస్తున్నాయి. ప్లేట్‌లెట్ల పేరుతో లక్షలకు లక్షలు వసూలుచేసే అవకాశాన్ని కోల్పోతామనే దుర్మార్గపు ఆలోచనతోనే తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర జబ్బులకు నిర్ణీత చికిత్స, సమయం వంటివి ఉంటాయి. డెంగీ వస్తే ప్లేట్‌లెట్ల సంఖ్యను బట్టి వైద్యం ఉంటుంది. పరిస్థితిని బట్టి రోజుల కొద్దీ ఆసుపత్రుల్లో ఉంచాలి.
 
 ఈ అంశాలను నిర్ధారించి ప్యాకేజీ ప్రకటించాలి. ఒకవేళ డెంగీని ఆరోగ్యశ్రీలో చేరిస్తే ప్రభుత్వం కనీస నిర్ణీత ప్యాకేజీ ప్రకటిస్తే... తమకు నష్టమని కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు భావిస్తున్నాయి. ప్రభుత్వం కూడా ప్రైవేటు ఆసుపత్రులకే వంతపాడుతోంది. మరోవైపు ఒక ప్రైవేటు బీమా కంపెనీ డెంగీకి ఆరోగ్య బీమా ఇస్తోంది. రూ.400 ప్రీమియం కడితే డెంగీ చికిత్సకు రూ.50 వేల వరకు ఇస్తామని చెబుతోంది. ఒక కంపెనీయే డెంగీకి బీమా ఇవ్వగలుగుతున్నప్పుడు ఆరోగ్యశ్రీలోకి తీసుకురావడానికి ప్రభుత్వం వెనుకాడుతుండడం సందేహాస్పదంగా మారింది.     
 
 పోలియో మాదిరిగా డెంగీపై ఉద్యమం
 ‘‘డెంగీ జ్వరం వస్తే చావడమేనా? ఇంతకుమించి దౌర్భాగ్యం మరొకటి ఉండదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్లేట్‌లెట్లు ఎక్కించే పరిస్థితి లేదు. కాబట్టి ఎవరైనా ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు రావాల్సిందే. ప్లేట్‌లెట్లు తగ్గితే చనిపోయే పరిస్థితులు ఉంటున్నాయి. పోలియోపై సమరం చేసినట్లుగా డెంగీపైనా చేయాలి. దీన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలి.’’    
 - శివకుమార్, ఓ కార్పొరేట్ ఆసుపత్రి ఉద్యోగి
 
 ఇది సాధారణ జ్వరమే..
 ‘‘డెంగీ సాధారణ జ్వరంలానే ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీలో ప్యాకేజీగా ప్రకటించడం కష్టం. డెంగీ వచ్చిన వారిలో కేవలం 5 శాతం మందికే సీరియస్ అవుతుంది. మిగతా వారికి నయం అవుతుంది. ప్రత్యేకంగా డెంగీ కోసం ఆరోగ్యశ్రీ కింద చికిత్సకు కవరేజీ లేకపోయినా ప్లేట్‌లెట్లు తగ్గి రక్తస్రావం జరిగితే ప్లేట్‌లెట్లకు కవరేజీ ఇవ్వొచ్చు..’’
 - డాక్టర్ చంద్రశేఖర్, తెలంగాణ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో
 
 ఐదేళ్లలో తెలంగాణలో డెంగీ కేసులు
 సంవత్సరం     నమోదైనవి
 2011    520
 2012    576
 2013    654
 2014    789
 2015 (ఇప్పటివరకు)     846

మరిన్ని వార్తలు