తుందుర్రులో దుర్మార్గం

9 Mar, 2017 01:39 IST|Sakshi
తుందుర్రులో దుర్మార్గం

మహిళా దినోత్సవంనాడు మహిళలపై దుశ్శాసనపర్వం  
ఆక్వాఫుడ్‌పార్క్‌ ఆందోళనకారులపై ఖాకీల అరాచకం..
మూడు గ్రామాల్లో బీభత్సం.. కర్ఫ్యూ వాతావరణం..
150 మంది మహిళలు సహా 200 మంది అరెస్టు
వైఎస్సార్‌ సీపీ నేతల గృహనిర్బంధం
తల్లిదండ్రుల అరెస్టుతో బిక్కుబిక్కుమంటున్న పిల్లలు


సాక్షి ప్రతినిధి, ఏలూరు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. ప్రపంచమంతా మహిళా సాధికారత కోసం, మహిళల మేలు కోసం రకరకాల కార్యక్రమాలను చేపడుతున్న రోజు. కానీ చంద్రబాబు  ప్రభుత్వం మాత్రం అదే మహిళా దినోత్సవం రోజున మహిళలపై దుశ్శాసన పర్వానికి తెగబడింది. చిన్నాపెద్దా తేడా లేకుండా మహిళలను ఈడ్చుకెళ్లి వ్యాన్లలో కుక్కి పోలీస్‌స్టేషన్లకు తరలించింది. ఇంట్లో చంటి బిడ్డలకు పాలిస్తున్న తల్లులనూ వదలలేదు. అత్యంత దుర్మార్గంగా అరెస్ట్‌ చేయించింది. శాంతియుతంగా నిరసన తెలపడమే వారు చేసిన నేరం... పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రు వేదికగా బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రోద్బలంతో ఖాకీలు చెలరేగిపోయారు. గతంలో తన హయాంలో అంగన్‌వాడీ మహిళలను గుర్రాలతో తొక్కించిన రీతిలోనే నేడు  మహిళలపై బాబు దాడులు చేయించారు.




తల్లుల అరెస్టులు.. పసివాళ్ల ఆక్రందనలు..
కాలుష్యకారక  ‘గోదావరి ఆక్వా మెగా ఫుడ్‌పార్క్‌’ నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ ఆక్వా పార్క్‌ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ, సీపీఎం మద్దతుతో పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాల ప్రజలు బుధవారం ఆందోళనకు దిగగా.. వృద్ధుల నుంచి చిన్నారుల వరకూ దొరికిన వారిని దొరికినట్లు పోలీసులు అరెస్ట్‌ చేశారు.  150 మందికిపైగా మహిళలు సహా 200 మందిని అదుపులోకి తీసుకోవడంతోపాటు ఇళ్లల్లోంచి ఎవరినీ బయటకు రానివ్వకుండా ఇంటికిద్దరు పోలీసులు కాపలా కాశారు.  దిక్కుతోచని స్థితిలో కొందరు బాలికలు పోలీస్‌ వ్యాన్‌కు అడ్డంగా కూర్చున్నారు. వారిని పోలీసులు పక్కకు నెట్టేశారు.


 

ఉద్యమంపై ఉక్కుపాదం...
రాష్ట్ర ప్రభుత్వం తుందుర్రు పరిసర గ్రామాల్లో 12వేల మంది పోలీసులను మోహరించింది. రెండు రోజులుగా ఆధార్‌ కార్డు చూపిస్తేనే గ్రామస్తుల రాకపోకలకు పోలీసులు అనుమతించారు. అనధికార కర్ఫ్యూ విధించారు. పోరాట కమిటీ నాయకులు ఆరేటి వాసు, ఆరేటి సత్యవతి, ముచ్చర్ల త్రిమూర్తులు, ఐద్వా నాయకురాలు కల్యాణితో సహా పలువురిని అరెస్టు చేశారు. ఉద్యమనాయకురాలు ఆరేటి సత్యవతిని బలవంతంగా ఈడ్చుకువెళ్లి వాహనంలో పడేయడంతో ఆమె కాలుకు గాయమైంది. ఇదిలా ఉంటే ఆందోళనకు మద్దతు పలికిన వైఎస్సార్‌ సీపీ నేతలను పోలీసులు ముందుగా గృహనిర్భంధం చేశారు. మాజీ ఎమ్మెల్యేలు ముదునూరి ప్రసాదరాజు, గ్రంధి శ్రీనివాస్‌లను హౌస్‌ అరెస్ట్‌లు చేశారు.




మూడేళ్లుగా ఉద్యమం..
తుందుర్రులో దాదాపు రూ. 150 కోట్లు వ్యయంతో చేపడుతున్న ఈ ఫుడ్‌ పార్క్‌ను సముద్ర తీరప్రాంతానికి తరలించాలని మూడేళ్లుగా దాదాపు 40 గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో మార్చి 8వ తేది లోపుగా ప్యాక్టరీ నిర్మాణ పనులు నిలిపివేయకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని గత నెలలోనే   ప్రకటించారు.

ప్రాణాలు పోయినా ఫుడ్‌పార్కు రానివ్వం
మూడేళ్లుగా గ్రామాల మధ్య ఫ్యాక్టరీ వద్దని పోరాడుతున్నాం. మహిళా దినోత్సవం రోజున శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తుంటే పోలీసులతో మాపై దాడులు చేయించారు.  మా ప్రాణాలు అర్పించైనా ఫుడ్‌ పార్కు పనులను అడ్డుకుంటాం.
– జవ్వాది వెంకటరమణ, ఎంపీటీసీ, తుందుర్రు

ఏ తప్పు చేశామని నిర్బంధిస్తున్నారు?
మేం ఏ తప్పు చేశామని పోలీసులు మమ్మల్ని నిర్బంధిస్తున్నారు? గ్రామాల మధ్య ఫుడ్‌పార్కు వద్దన్నాం. అంతే.. పోలీసులు మా వాళ్లను సుమారు 200 మందిని వ్యాన్లలో ఎక్కించుకుని తీసుకుపోయారు. బాలింతరాలైన జవ్వాది భవానీని ఆమె 9 నెలల పాపను వదిలేసి నిర్బంధించారు. ఇదేమి దారుణం?
– ముచ్చర్ల సత్య, గృహిణి, కంసాల బేతపూడి

అయ్యో.. పాపం పసివాళ్లు
తల్లులకు పిల్లలను దూరం చేశారు  
తుందుర్రులో పోలీసుల నిర్వాకం

బీమవరం అర్బన్‌ :  ఆ తల్లులకు పిల్లలను దూరం చేశారు. పిల్లలకు పాలు ఇవ్వాల్సిన తల్లులు నర్సాపురం పోలీసు స్టేషన్‌లో మగ్గుతుంటే వారి చిన్నారులు ఇంటివద్ద గుక్కపట్టి ఏడుస్తూ ఉండిపోయారు.... బాబు నిరంకుశ త్వాన్ని, పోలీసుల కర్కశత్వాన్ని కళ్లకు కట్టిన ఈ దయనీయ ఘటనలు పశ్చిమగోదావరి జిల్లా  మెగా ఆక్వాఫుడ్‌పార్కు బాధిత గ్రామాల్లో చోటుచేసుకున్నాయి. కంసాలబేతపూడి చెందిన 9 నెలల పాప తల్లి జవ్వాది భవానీని పోలీసులు తీసుకెళ్లిపోయారు. దీంతో పాప పాలకోసం గుక్కపెట్టి ఏడుస్తుంటే అంతా కంటతడి పెట్టారు.అలాగే  జోత్స్నశ్రీ తల్లి ముచర్ల నాగలక్ష్మిని  పోలీసులు ఉదయాన్నే తీసుకెళ్లిపోయారు.  బెల్లపు ప్రసాద్‌ దంపతులను అరెస్టు చేయడంతో వారి పిల్లలు  ధరణి,  భార్గవి నిస్సహాయ స్థితిలో  ఏడుస్తున్నారు. పోలిశెట్టి సత్తిబాబు దంపతుల పిల్లలు   శ్రావణి,  చింటూలదీ ఇదే దుస్థితి.  ఈ చిన్నారుల స్థితిని చూసిన స్థానికులు ఆవేదనకు గురయ్యారు. పోలీసుల దమన కాండపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రుభత్వాన్ని తిట్టిపోశారు.

మరిన్ని వార్తలు