నట్లు, బోల్టులు, మేకులే అతడి ఆహారం!

23 Apr, 2015 17:29 IST|Sakshi
ఎండోస్కోపిలో బయటపడిన నట్లు, బోల్టులు

బటిండా: పంజాబ్ రాష్ర్టంలోని బటిండాకు చెందిన రైతు రాజ్‌పాల్ సింగ్....34 ఏళ్లు... నట్లు, బోల్టులు, బ్యాటరీలతోపాటు 140 నాణెంలు, 150 మేకులు తిన్నాడు. మూడేళ్లుగా ఆయనకు అదే పని. ఇంకా అదేపనిగా వాటిని తినాలని కోరుకున్న ఆయనకు కడుపు నొప్పి అడ్డం పడింది. దాంతో ఆస్పత్రుల చుట్టూ తిరిగాడు. ఎక్కడికెళ్లినా తగ్గలేదు. కడుపునొప్పి ఎందుకొస్తుందో ఆ ఆస్పత్రుల వైద్యుల గుర్తించలేక పోయారు. చివరకు స్థానికంగా ఉన్న గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ డాక్టర్ గగన్‌దీప్ గోయల్ ఆస్పత్రికి వెళ్లాడు.

అక్కడ ఆయన కడుపుకు ఎండోస్కోపి చేసిన డాక్టర్లు అవాక్కయ్యారు. కడుపా, ఇనుప సామాన్ల కొట్టా! అంటూ గద్దించిన డాక్టర్లు ఆ తర్వాత శస్త్ర చికిత్స ద్వారా రాజ్‌పాల్ సింగ్ మింగిన నట్లు, బోట్లు, మేకులు, నాణెంలు వెలికి తీశారు. అయినప్పటికీ అయన కడుపులో ఇంకా కొన్ని ఇనుప సామాన్లు మిగిలిపోయాయి. పదే పదే ఆపరేషన్లు చేస్తే ఆయన శరీరం తట్టుకునే పరిస్థితి ప్రస్తుతం లేదని, ఓ వారం రోజుల తర్వాత మరోసారి ఆపరేషన్ చేసి మిగిలిన వాటిని వెలికి తీస్తామని డాక్టర్ గోయల్ తెలిపారు.

మానసిక ఒత్తిడి కారణంగా చచ్చిపోదామనుకొని మూడేళ్ల క్రితం ఇనుప వస్తువులు మింగడం మొదలు పెట్టానని, ఆ తర్వాత వాటిని తినకుండా ఉండలేక పోయానని, తినకపోతే కడుపులో వెలితిగా ఉండేదని రైతు రాజ్‌పాల్ సింగ్ మీడియాకు తెలిపాడు. నేరుగా వాటిని మింగలేక పాలల్లో, పండ్ల రసాల్లో కలుపుకొని సున్నితంగా మింగేవాడట.

తనకు ఈ చెడలవాటున్న విషయం సింగ్ ఏ డాక్టరుకు చెప్పలేదట. అందుకే చాలా మంది డాక్టర్లు కడుపునొప్పికి కారణం ఏమిటో కనుక్కోలేక పోయారు. అనవసరమైనవాటికి అడ్డమైన టెస్టులు రాసే డాక్టర్లున్న నేటి ప్రపంచంలో సింగ్‌కు చిన్న ఎక్స్‌రే కూడా రాయకపోవడం వృత్తిపట్ల ఎంత నిజాయితీయో!

మరిన్ని వార్తలు