నోట్ల రద్దయితే ఏంటి.. చైనా కంటే భారతే ఫాస్ట్!

7 Jan, 2017 18:09 IST|Sakshi
నోట్ల రద్దయితే ఏంటి.. చైనా కంటే భారతే ఫాస్ట్!
సింగపూర్ : పెద్ద నోట్ల రద్దుతో ఆర్థికవ్యవస్థ కొంత మందగించింది. ఇదే అవకాశంగా చైనా ఆర్థికవ్యవస్థ మనకంటే ముందుకు దూసుకుపోతుందా? అంటూ పలువురిలో పలు సందేహాలు నెలకొన్నాయి. కానీ దేశీయంగా పెద్ద నోట్ల ప్రభావం ఉన్నప్పటికీ, చైనా కంటే భారత్  ఆర్థికవృద్ధినే శరవేగంగా దూసుకెళ్తుందని ప్రపంచ ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచ దిగ్గజ యూనివర్సిటీలన్నీ కలిపి ఏర్పాటుచేసిన కాన్ఫరెన్స్లో మాజీ సింగపూర్ రాయబారి, భారత సంతతికి చెందిన ఓ విద్యావేత్త ఇదే అంశాన్ని ఉద్ఘాటించారు. పెద్ద నోట్ల రద్దు  ఆర్థికవ్యవస్థను నెమ్మదించేలా చేసినా... భారత ఆర్థికవృద్ధిలో దీర్ఘకాలికంగా ఎలాంటి మార్పు ఉండదని సింగపూర్లోని నేషనల్ యూనివర్సిటీ పబ్లిక్ పాలసీ లీ కౌన్ యూ స్కూల్ డీన్ కిషోర్ మహబూబానీ చెప్పారు.
 
పెద్ద నోట్ల రద్దు భారత ఎకానమీకి దీర్ఘకాలికంగా ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తుందన్నారు. ఆర్థికవ్యవస్థలో ఉన్న నల్లధనం వెనక్కివచ్చేస్తుందని ఇది ఆర్థికవ్యవస్థకు మంచిదని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఉన్నప్పటికీ, చైనా కంటే భారత్ ఆర్థికవృద్ధే శరవేగంగా దూసుకెళ్తుందన్నారు. ఏకపక్ష ప్రపంచం(యునిపోలార్ వరల్డ్) నుంచి ఇప్పడు బహుళ ధ్రువ ప్రపంచం(మల్టీ-పోలార్ వరల్డ్)లోకి పయనిస్తున్నామని, ఇది చిన్న దేశాలకు ఎంతో మేలు చేకూరుస్తుందని కిషోర్ చెప్పారు. మల్టీ-పోలార్ వరల్డ్ సింగపూర్కు మరిన్ని అవకాశాలు కల్పిస్తుందని, చైనా, అమెరికా, ఇండియా, యూరప్ దేశాలతో మనకు మంచి సంబంధాలున్నాయని ఆయన పేర్కొన్నారు.  గ్లోబల్ ట్రెండ్స్పై చర్చ నేపథ్యంలో ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటుచేశారు. మూడు రోజుల పాటు ఈ సమావేశం జరిగింది. భౌగోళిక రాజకీయ ఆందోళనలు, సైబర్ అటాక్స్, ఉత్తరకొరియా క్షిపణి ఆవిష్కరణ, బ్రెగ్జిట్ వంటి పలు విషయాలపై ఈ సమావేశంలో చర్చించారు. 
 
>
మరిన్ని వార్తలు