గ్రామాలతోనే 'బంగారు'బాట

18 Feb, 2017 01:29 IST|Sakshi
గ్రామాలతోనే 'బంగారు'బాట

పల్లెలను పటిష్టపర్చడమే బంగారు తెలంగాణ: సీఎం కేసీఆర్‌
- అద్భుత మానవ వనరులే మన అసలైన సంపద
- దూరదృష్టితో వృత్తి పనులకు చేయూతనిస్తున్నాం
- రాజకీయ అవినీతిని 95 శాతం తగ్గించాం
- రాష్ట్రాన్ని దేశంలోనే గొప్పగా తీర్చిదిద్దడం నా లక్ష్యం
- 4 లక్షల యాదవ కుటుంబాలకు సబ్సిడీపై 88 లక్షల గొర్రెలిస్తాం..
- గొల్ల కురుమలు లక్షాధికారులు, కోటీశ్వరులు కాబోతున్నారు
- ‘జనహిత’ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేసీఆర్‌


సాక్షి, హైదరాబాద్‌

దేశంలో ఏ రాష్ట్రం లేనంత గొప్పగా తెలంగాణను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. బంగారు తెలంగాణ ఎక్కడో లేదని, గ్రామీణ వ్యవస్థను పటిష్టం చేయడంలోనే ఉందని చెప్పారు. అపార నైపుణ్యమున్న మానవ వనరులే అసలైన సంపద అని పేర్కొన్నారు. ‘‘తెలంగాణ కొత్త రాష్ట్రం. కొందరికి ఎప్పుడెప్పుడు అధికారంలోకి రావాలా అన్న ఆలోచన ఉంటుంది. నా ఆలోచన వేరు. ప్రజలకు అధికారం రావాలి. అదే నాకు ప్రాధాన్యం. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపూర్ణంగా బలోపేతం చేసే కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇవి చిల్లర మల్లర రాజకీయాల కోసం చేసేటివి కావు. మంచి ఉద్దేశంతో ముందుకుపోతున్నా. భవిష్యత్తును దర్శించి పేదరిక నిర్మూలనకు, వృత్తి పనివాళ్ల కోసం కార్యక్రమాలు చేపడుతున్నాం..’’అని చెప్పారు.

శుక్రవారం ప్రగతిభవన్‌లో జనహిత కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగించారు. ‘‘ఆర్థిక పురోగతిలో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలోని ఆర్థిక వనరులతో వచ్చే ఆదాయంలో 19.5 శాతం వృద్ధి సాధించింది. దేశంలో తెలంగాణ నంబర్‌ వన్‌ రాష్ట్రంగా ముందుకెళుతోంది. రాష్ట్రంలో రాజకీయ అవినీతిని 95 శాతం తగ్గించాం. గతంలో ఉన్న అరాచకల్లేవు. రాష్ట్ర ఆర్థిక పురోగతి అద్భుతంగా ఉంది. రాష్ట్రం ఏర్పాటై మూడేళ్లు కావొస్తుంది. దేశంలో ఇప్పుడు ధనిక రాష్ట్రం మనదే’’అని అన్నారు. సీఎం ఏమన్నారో ఆయన మాటల్లోనే...

ఏడాదిన్నర తర్వాత అవగాహన వచ్చింది
రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలినాళ్లలో పరిస్థితి అంతా గందరగోళంగా ఉండేది. ఏడాదిన్నర తర్వాత ఒక అవగాహన వచ్చింది. ఆ తర్వాత ఒక్కో కార్యక్రమాన్ని చేపడుతూ ముందుకెళుతున్నాం. టీఎస్‌ఐపాస్‌ పెట్టుకున్నాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్ట పరిచేందుకు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాం. తాగునీటి సమస్య శాశ్వతంగా దూరం చేసేందుకు మిషన్‌ భగీరథ అమలు చేశాం. ఇంటింటికీ మంచినీటిని అందిస్తే ప్రజారోగ్యం బాగుపడుతుంది. రోగాలు దరిచేరవు. ఆ నీరు వచ్చాక ఇప్పుడున్న భోజనం, కూరల రుచి మారుతుందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టానికి సాగునీటి వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. ఇప్పటికే ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. రైతులకు కులం లేదు. భూమి ఉన్న వారందరూ రైతులే. సాగునీరుంటేనే రైతులు బాగుపడుతారు.

ఇప్పుడు కరెంటు పోతే వార్త
తెలంగాణ వస్తే ఆగమై పోతారు.. కరెంటు ఉండదు.. అంధకారమేనని ఆఖరి సీఎం కట్టె పట్టుకుని చెప్పిండు. కానీ ఇప్పడు కరెంటు పుష్కలంగా ఉంది. ఇప్పుడు తెలంగాణలో కరెంటు ఉంటే కాదు.. కరెంటు పోతే వార్త. విద్యుత్‌ సమస్యను సంపూర్ణంగా పరిష్కరించుకున్నాం. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్ట పర్చేందుకు కొత్త కార్యక్రమాలు చేపడుతున్నాం. జిల్లాల వారీగా మానవ వనరులపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వమని కలెక్టర్లకు చెప్పా. కానీ చాలా మంది కలెక్టర్లకు అది అర్థమైనట్లు లేదు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు సైతం అర్థం కాలేదు. నా లెక్క ప్రకారం మానవ వనరులంటే మన వృత్తి పనివాళ్లు. అద్భుతమైన నైపుణ్యమైన తెలంగాణ బిడ్డలు.

గతంలో చేపల ఉత్పత్తిపై దృష్టి పెట్టలేదు
తెలంగాణలో మత్స్య కార్మికులు 40 లక్షల మంది ఉన్నారు. వారితో చేపల పరిశ్రమను అభివృద్ధి చేయాలి. చేపల ఉత్పత్తి పెంచి మార్కెట్‌ చేయగలిగితే అదే తెలంగాణ మానవ వనరుగా నా లెక్క. అసెంబ్లీలో చేపల గురించి నేను మాట్లాడినందుకు ఏపీకి చెందిన నేతలు సైతం అభినందనలు తెలిపారు. గతంలో చేపల ఉత్పత్తిపై దృష్టి పెట్టలేదు. అలాగే రాష్ట్రంలో 25.50 లక్షల మంది యాదవులున్నారు. ఇంతమంది ఉన్నా సమైక్య పాలనలో వీళ్లను పట్టించుకోలేదు. వీరికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. వేరే ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు రోజూ 600 గొర్రెల లారీలు వస్తున్నాయి. రామ్‌నగర్‌ చేపల మార్కెట్‌కు 35 నుంచి 40 లారీల్లో చేపలు దిగుమతి అవుతున్నాయి. యాదవ, ముదిరాజ్‌ సోదరులను అద్భుత నైపుణ్యమైన, గొçప్పగా పని చేసే జాతి రత్నాలుగా వీరిని నేను గుర్తిస్తా. తెలంగాణ సంపద అంటే వీళ్లే. 4 లక్షల యాదవ కుటుంబాలకు దేశంలో ఎక్కడా లేని విధంగా 75 శాతం సబ్సిడీపై 88 లక్షల గొర్రెలు సరఫరా చేస్తాం. అంతకంతకు ఆ సంపద రెట్టింపవుతుంది.

దిసీజ్‌ బంగారు తెలంగాణ..
ఇప్పుడున్న 50 లక్షల గొర్రెలు కాకుండా.. రెండేళ్లలో దాదాపు 4 కోట్ల గొర్రెలు తయారవుతాయి. ఒక్కో గొర్రెకు రూ.5 వేలు లెక్కేసినా.. ఒక తెలంగాణ యాదవ కులం దగ్గర రూ.20 వేల కోట్ల సంపద సమకూరుతుంది. దిసీజ్‌ తెలంగాణ. ఇదీ బంగారు తెలంగాణ. ఆ దార్శనికత కావాలి. కాల్పనికత కావాలి. చేరుకునే ధృతి ఉధృతి కావాలి. ఆ ఉధృతితో చేరుకుంటే నూరు శాతం ఫలితం వస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా గొల్ల కురుమలు లక్షాధికారులు, కోటీశ్వరులు కాబోతున్నారు. నేను బతికున్న కాలంలోనే ఇది సాధించి చూపిస్తా. అదేవిధంగా కుమ్మరులు, నాయి బ్రాహ్మణులు ఉన్నారు. ఆధునిక పద్ధతుల్లో కుండలు తయారు చేసే కార్యక్రమాలపై ఆలోచిస్తున్నాం. అనాగరిక పద్ధతులకు భిన్నంగా ప్రతి గ్రామంలో నవీన క్షౌ రశాలలు( హైజెనిక్‌ సెలూన్‌) పెట్టించే ప్రయత్నం చేస్తున్నాం.

ధనిక రాష్ట్రంలో పేదరికం ఎందుకుండాలె?
గుడ్డి లెక్కన చెప్పాలంటే.. తెలంగాణ ఆదాయంలో ఏటా రూ.10 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల నగదు పెరుగుదల ఉంటుంది. దేశంలో ఏ రాష్ట్రానికి ఇంత ఆదాయం లేదు. ఇంత డబ్బున్నప్పుడు పేదరికమెందుకుండాలె? ఇక్కడ వృత్తి పనివాళ్లు ఎందుకు చిన్నబోవాలె? అలా ఉండటానికి వీల్లేదు. అదే దిశగా కార్యచరణ చేపడుతున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్ర అవగాహన వచ్చిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలతో అద్భుతంగా పురోగమిస్తాం.

ఎర్రవల్లి ఆదర్శం
నోట్ల రద్దు తర్వాత నేను దత్తత తీసుకున్న ఎర్రవల్లి గ్రామంలో ఒక బ్యాంకు ఏర్పాటు చేస్తే.. అక్కడ ప్రజలు రూ.75 లక్షలు డిపాజిట్‌ చేశారు. ఇంత డబ్బు ఎక్కడిదని ఒక ముసలావిడను నేను అడిగినా.. ‘పించన్‌ డబ్బులు మొత్తం ఖర్చు చేస్తలేం.. దాచుకుంటున్నాం..’అని నాతో చెప్పింది. గ్రామీణ ప్రాంతాల ఆదాయం విస్తరిస్తే.. అన్ని వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. అందరికీ పని దొరుకుతుంది. డబ్బు సర్క్యులేట్‌ అవుతుంది. ఇది గ్రామ సంపద. గామీణ వృత్తులు.. గ్రామీణ ఆదాయం పెరిగితే ప్రతి గ్రామం ధనిక గ్రామం అవుతుంది. ఆపదలు ఎదుర్కొనే స్తోమత సమకూరుతుంది.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కలర్స్‌ సంక్రాంతి

‘విధి’ విజయం సాధించాలి

అనుకోని అతిథి!

సినిమా

బన్నీపై కేరళ సీఎం ప్రశంసల వర్షం

కరోనాపై పోరు.. సీసీసీకి బ్రహ్మానందం విరాళం

‘వాసు’ గుర్తున్నాడా? వచ్చి 18 ఏళ్లైంది!

పోలీసు బిడ్డగా వారికి సెల్యూట్‌ చేస్తున్నా: చిరు

దూరంగా ఉంటునే ఆశీర్వదించారు

కరోనా పోరు: మరోసారి అక్షయ్‌ భారీ విరాళం