శబరిమలైలో మకరజ్యోతి దర్శనం

14 Jan, 2014 18:51 IST|Sakshi
శబరిమలైలో మకరజ్యోతి దర్శనం

అయ్యప్ప స్వామి భక్తులు శబరిమలైకు పోటెత్తారు. సంక్రాంతి పర్వదినాన్ని  పురస్కరించుకుని మకరజ్యోతి దర్శనం కోసం బారులు తీరారు. మంగళవారం సాయంత్రం మకరజ్యోతి దర్శనభాగ్యం లభించింది. అయ్యప్పల శరణు ఘోషతో శబరిమలై మార్మోగిపోయింది.

మకరజ్యోతి దర్శనం కోసం భక్తులు శబరిమలై సన్నిధానం నుంచి పంబ వరకు బారులు తీరారు. కేరళతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు తరలివెళ్లారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి ఏటా లక్షలాదిమంది భక్తులు మాలను ధరించి మకరజ్యోతి దర్శనం కోసం వెళ్తుంటారు. ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో వచ్చారు. భక్తులకు అసౌకర్యం ఏర్పడినా జ్యోతి దివ్య దర్శనం కోసం ఓపిగ్గా ఎదురు చూశారు. గత రెండు రోజులుగా మొత్తం పదిలక్షల మంది స్వామిని దర్శించుకుని ఉంటారని అధికారుల అంచనా. మంగళవారం మరింత భారీ సంఖ్యలో తరలివచ్చారు. 
 

మకరజ్యోతి దర్శనాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. అయ్యప్ప స్వామి మాలను ధరించిన భక్తులు నియమ నిష్టలతో  దీక్షను ఆచరించి దర్శనానికి వస్తుంటారు. గతేడాదితో పోలిస్తే దేవస్థానం అధికారులు ఈ సారి భక్తులు మెరుగైన సౌకర్యాలు కల్పించారు. అయినా కొండప్రాంతం కావడంతో భక్తుల సంఖ్యకు తగినట్టు ఏర్పాట్లు చేయడం కష్టతరంగా మారుతోంది. గతంలో జరిగిన తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

మరిన్ని వార్తలు