గోవాలో కాంగ్రెస్ ఎందుకు ఫెయిలైంది?

18 Mar, 2017 16:31 IST|Sakshi
గోవాలో కాంగ్రెస్ ఎందుకు ఫెయిలైంది?

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావల్సిన బలానికి చాలా దగ్గరగా ఉండి, ఒక చిన్న పార్టీ మద్దతిచ్చేందుకు ముందుకు కూడా వచ్చిన సందర్భంలోనూ తాము గోవాలో అధికారం చేపట్టకుండా ఆగిపోవడానికి ఏకైక కారణం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగేనని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఆయనతో పాటు గోవా స్క్రీనింగ్ కమిటీ చీఫ్ కేసీ వేణుగోపాల్ వల్లే తమకు అధికారం దక్కలేదని గోవా పీసీసీ చీఫ్ లుజిన్హో ఫాలైరో తీవ్రంగా ఆరోపించారు. 40 స్థానాలున్న గోవాలో కాంగ్రెస్‌ పార్టీ 17 సీట్లు గెలుపొంది.. అతిపెద్ద పార్టీగా నిలిచింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ 21కు కేవలం నాలుగు సీట్ల దూరంలో ఉండటంతో ఎలాగైనా తామే సర్కారును ఏర్పాటుచేస్తామని గోవా కాంగ్రెస్‌ నేతలు ధీమాతో ఉన్నారు. కానీ, కేవలం 13 స్థానాలే గెలుపొందిన బీజేపీ రాత్రికే రాత్రే చక్రం తిప్పి.. చిన్న పార్టీల మద్దతుతో మెజారిటీ ఫిగర్‌ను సాధించింది.

నిజానికి తాము మద్దతిస్తామంటూ గోవా ఫార్వర్డ్ పార్టీ నాయకుడు విజయ్ సర్దేశాయ్ ముందుగా దిగ్విజయ్ సింగ్‌తోనే చెప్పారు. వాళ్లకు ముగ్గురు ఎమ్మెల్యేలున్నారు. మరొక్క ఇండిపెండెంట్ మద్దతు తీసుకోవడం పెద్ద కష్టం కానే కాదు. కానీ అలాంటి సమయంలో దిగ్విజయ్ సింగ్ సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లే గోవాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలిగిందన్నది స్థానిక కాంగ్రెస్ నాయకుల వాదన. ముందుగానే గవర్నర్ మృదులా సిన్హా వద్దకు వెళ్లి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని చెప్పి ఉంటే, అతిపెద్ద పార్టీగా ముందు తమకే అవకాశం వచ్చి ఉండేదని ఫాలైరో అన్నారు. మనోహర్‌ పారికర్‌ ప్రమాణాన్ని నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది.

దిగ్విజయ్ సింగ్ స్పందించి ఉంటే కాంగ్రెస్‌కు మద్దతిచ్చేందుకు మరికొందరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా అప్పటికి సిద్దంగా ఉన్నారు. మార్చి 11వ తేదీ రాత్రికి తమకు 21 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, అయితే తమవద్ద వాళ్ల సంతకాలు మాత్రం లేవని ఫాలైరో చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఈ విషయంలో అన్ని అధికారాలను దిగ్విజయ్, వేణుగోపాల్‌లకు ఇచ్చిందని, వాళ్లు సరైన సమయంలో స్పందించకపోవడం.. మరోవైపు బీజేపీ వెంటవెంటనే స్పందించడం వల్లే తమకు అధికారం దూరమైందని ఆయన వాపోయారు. తాను ఈశాన్య రాష్ట్రాల ఇన్‌చార్జిగా ఉన్నప్పుడు అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకునేవాడినని తెలిపారు.

మరిన్ని వార్తలు