ప్రముఖ దర్శకుడి పెళ్లి తేదీ ఇదే!

30 Aug, 2016 18:31 IST|Sakshi
ప్రముఖ దర్శకుడి పెళ్లి తేదీ ఇదే!

తెలుగు సినీ పరిశ్రమ టాలీవుడ్‌లో ప్రస్తుతం వెడ్డింగ్‌ సీజన్‌ నెలకొంది. ముఖ్యంగా ప్రతిభావంతులైన దర్శకులంతా వరుసగా బ్యాచ్‌లర్‌ జీవితానికి చరమగీతం పాడి.. వైవాహిక జీవితంలో అడుగుపెడుతున్నారు. ఇప్పటికే దర్శకులు క్రిష్‌, హను రాఘవపూడి పెళ్లిలు చేసుకొని ఓ ఇంటి వారు అయ్యారు. తాజాగా ఈ జాబితాలోకి 'మనం', 'ఇష్క్‌', '24' చిత్రాల దర్శకుడు విక్రమ్‌ కే కుమార్‌ కూడా చేరబోతున్నారు.

'24' సినిమాకు సౌండ్‌ ఇంజినీర్‌గా పనిచేసిన శ్రీనిధిని విక్రమ్‌ ప్రేమించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి వివాహ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. వచ్చే నెల 4న శ్రీనిధిని చెన్నైలో విక్రమ్‌ కే కుమార్‌ పెళ్లి చేసుకోబోతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. చెన్నైలోని హిల్టన్‌ హోటల్‌లో అంగరంగ వైభవంగా జరగనున్న వీరి వివాహానికి నాగార్జున, ఏఆర్‌ రహమాన్‌, సూర్య, శ్రియ శరణ్‌, నిత్యా మీనన్, సమంత, మాధవన్‌ వంటి దక్షిణాది సినీ ప్రముఖులు పలువురు రానున్నట్టు సమాచారం. విక్రమ్‌ కే కుమార్‌ పెళ్లిముహూర్తం నిశ్చయమవ్వడంతో శుభలేఖలు అచ్చువేయించి బంధుమిత్రులకు అందజేస్తున్నట్టు తెలుస్తున్నది.

'మనం', 24 వంటి విభిన్న సినిమాలు అందించిన విక్రమ్ కే కుమార్‌ ప్రస్తుతం మహేష్‌ బాబుతో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందుకోసం స్క్రిప్ట్‌ పనుల్లో అతను బిజీగా ఉన్నట్టు సమాచారం.

మరిన్ని వార్తలు