వేలంలో 'భారత్‌' వెలవెల..!

20 Feb, 2017 13:12 IST|Sakshi
వేలంలో 'భారత్‌' వెలవెల..!

ఈసారి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) వేలంపాటలో భారత క్రికెటర్లకు చేదు అనుభవమే ఎదురైంది. సోమవారం ఇప్పటివరకు జరిగిన వేలంపాటలో విదేశీ ఆటగాళ్లకు రికార్డుస్థాయి ధరకు అమ్ముడుపోగా.. భారత క్రికెటర్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు మొగ్గు చూపలేదు. భారత్‌ స్టార్‌ బౌలర్‌ ఇషాంత్‌ శర్మను సైతం కొనుగోలు చేసేందుకు ఏ జట్టు ఆసక్తి చూపలేదు. అతని కనీస ధర రూ. 2 కోట్లు కావడంతో కొనుగోలుకు ఫ్రాంచైజీలు వెనుకడుగువేశాయి. ఇక మరో భారత క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ను కూడా ఎవరూ కొనుగోలు చేయలేదు. అతని కనీస ధర రూ.50 లక్షలైనా ఫ్రాంచైజీలు ముందుకురాకపోవడం గమనార్హం.

అదేవిధంగా భారత క్రికెటర్లు అయిన ప్రజ్ఞాన్‌ ఓజా, ఉన్ముక్త్‌ చంద్‌, పృథ్వీషా తదితరులకు కూడా చేదు అనుభవమే మిగిలింది. ఆయా క్రికెటర్లను కొనేందుకు ఇప్పటివరకు ఫ్రాంచేజీ యాజమాన్యాలు నిరాకరించాయి. ఇక పలువురు విదేశీ స్టార్‌ క్రికెటర్లకు కూడా ఈసారి వేలంలో నిరాశే ఎదురైంది. న్యూజిలాండ్‌ క్రికెటర్లు రాస్‌ టేలర్‌, మార్టిన్‌ గఫ్తిల్‌, ఇంగ్లండ్‌ ఆటగాళ్లు జాసన్‌ రాయ్‌ కు ఆశాభంగం తప్పలేదు.  బ్రాడ్‌ హాగ్‌ (ఆస్ట్రేలియా), ఇమ్రాన్‌ తాహిర్‌ (దక్షిణాఫ్రికా), ఆండ్రూ ఫ్లెచర్ (వెస్టిండీస్)లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచేజీలు ఆసక్తి చూపలేదు.
 

మరిన్ని వార్తలు