తెలంగాణ పల్లెల్లో విధ్వంసం సృష్టించొద్దు

30 Sep, 2015 12:25 IST|Sakshi
తెలంగాణ పల్లెల్లో విధ్వంసం సృష్టించొద్దు

తెలంగాణ పల్లెల్లో విధ్వంసం సృష్టించొద్దని మానవహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే అవి 30, 40 ఏళ్ల పాటు నలిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్కౌంటర్లు లేని తెలంగాణను తమకివ్వాలని ప్రభుత్వాన్ని, కేసీఆర్ను కోరుతున్నట్లు ఆయన తెలిపారు. వందేళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్ర చరిత్ర రాస్తే, మొదటి మంత్రివర్గం ఎలా పనిచేసిందన్నది రికార్డవుతుందని, ఈ విషయాన్ని కేసీఆర్ గుర్తించాలని ఆయన చెప్పారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం సమీపంలో ఆయనను పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

పోలీసులకు పైనుంచి అనుమతి ఉంటేనే ఎన్కౌంటర్లు జరుగుతాయని చెప్పారు. వీలుంటే అరెస్టు చేయడం, విచారించడం, న్యాయవ్యవస్థ ద్వారా విచారణ చేయడం పద్ధతి అని, మావోయిస్టుల విషయంలోనైనా.. మరెవరి విషయంలోనైనా ఇదే చేయాలని చెప్పారు. ఏకపక్షంగా చంపడం రాజ్యానికి, తెలంగాణ ప్రభుత్వానికి మంచిది కాదని అన్నారు. వందేళ్ల తర్వాత చరిత్ర రాస్తే ఈ మొదటి కేబినెట్ ఎలా పనిచేసిందన్నది రికార్డవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఉమ్మడి రాష్ట్ర పోలీసులైనా, తెలంగాణ పోలీసులైనా ఒకేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఇది తెలంగాణ ప్రభుత్వం.. ప్రజలను ఏమీ చేయొద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలిస్తే వాళ్లేమీ చేయరని తెలిపారు.

మరిన్ని వార్తలు