గ్రూప్స్ సిలబస్‌పై ఆందోళన వద్దు

24 Aug, 2015 02:21 IST|Sakshi
గ్రూప్స్ సిలబస్‌పై ఆందోళన వద్దు

అభ్యర్థులకు సుంకిరెడ్డి సూచన
సాక్షి, హైదరాబాద్: ‘సీమాంధ్రుల పాలనలో తెలంగాణ చరిత్ర పూర్తిగా మరుగున పడిపోయింది. తెలంగాణ చరిత్రను వక్రీకరించి సీమాంధ్రుల పాలనను చరిత్రలో అక్రమంగా చొప్పించారు. దాన్ని పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టి ఇంతకాలం విద్యార్థులతో బలవంతంగా చదివించారు. ఇప్పుడిక ఆ అవసరం లేదు. సీమాంధ్రులు రాసిన ఆంధ్రుల చరిత్రతో తెలంగాణ అభ్యర్థులకు ఇక పన్లేదు. మన చరిత్రను మనమే మన పాఠ్యాంశాల్లో పొందుపర్చుకుని చదువుకునే సమయం వచ్చింది’ అని ప్రముఖ రచయిత డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు.

ఆయన ఆదివారం ‘సాక్షి’ తో మాట్లాడారు. ‘‘తెలంగాణ చరిత్రపై ఇప్పటికే అనేక పుస్తకాలు మార్కెట్లోకి వచ్చాయి. ఏది పడితే అది చదివి మోసపోవద్దు. ఒకరు చేసిన తప్పలను మిగతా వారు అనుసరించడం వల్ల వాటిలో అనేక తప్పులు దొర్లాయి. దీనిపై మేం పలువురు తెలంగాణ నిపుణులతో చర్చించాం. శాసనాలు, గ్రంథాలను క్షుణ్నంగా అధ్యయనం చేశాం. వాస్తవాలను ప్రామాణికంగా తీసుకుని ‘తెలంగాణ చరిత్ర-క్రీస్తుపూర్వం నుంచి 1948 వరకు’ పుస్తకాన్ని ముద్రించాం.

ఇది గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3తో పాటు ఇతర పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. తెలంగాణ చుట్టూ విస్తరించి ఉన్న సామ్రాజ్యాలు, సామంత రాజులు తదితరాలను కూడా అధ్యయనం చేయాలి. తెలంగాణ చరిత్రనే తెలంగాణ అభ్యర్థులు ప్రమాణికంగా తీసుకోవాలి. ప్రశ్నలు జవాబుల కోణంలో కాకుండా తెలంగాణ చరిత్రను సమగ్రంగా అర్ధం చేసుకోవాలి. చరిత్ర పట్ల ఆసక్తి, మమకారముంటేనే ఇది సాధ్యం. పేపర్లను దిద్దేదీ తెలంగాణ నిపుణులే. కాబట్టి తెలంగాణ చారిత్రక నేపథ్యంపై పోటీ పరీక్షల్లో అడిగే ప్రశ్నలకు నిర్భయంగా జవాబు రాయవచ్చు’’ అని వివరించారు.

మరిన్ని వార్తలు