ఆ 'హీరో' డాక్టర్‌పై వేటుపడింది!

14 Aug, 2017 09:41 IST|Sakshi
ఆ 'హీరో' డాక్టర్‌పై వేటుపడింది!

గోరఖ్‌పూర్‌: చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు సొంత డబ్బుతో ఆక్సీజన్‌ సిలిండర్లు కొనుగోలు చేసినట్టు సోషల్‌ మీడియాలో హీరోగా ప్రచారం పొందిన డాక్టర్‌పై అనుహ్యంగా వేటు పడింది.  బాబా రాఘవ్‌ దాస్‌ (బీఆర్డీ) మెడికల్‌ కాలేజీలో మెదడువ్యాపు వ్యాధి విభాగానికి నోడల్‌ అధికారిగా ఉన్న ఆయనను తొలగించారు. విధులను ఉల్లంఘించి.. ప్రైవేటు ప్రాక్టీస్‌ చేస్తున్నందుకు కఫీల్‌ ఖాన్‌పై వేటు వేశారు. మెదడువాపు వ్యాధి కారణంగా బీఆర్డీ మెడికల్‌ కాలేజీ దవాఖానాలో పెద్దసంఖ్యలో చిన్నారులు చనిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

ఈ ఘటన నేపథ్యంలో గత గురువారం సొంత డబ్బుతో బయటినుంచి ఆక్సీజన్‌ సిలిండర్లు తెప్పించి.. చిన్నారుల ప్రాణాలు కాపాడినట్టు సోషల్‌ మీడియాలో, మీడియాలో కఫీల్‌ ఖాన్‌పై కథనాలు వచ్చాయి. అయితే, ఆస్పత్రిలో ఆక్సీజన్‌ సిలిండర్లు అందుబాటులో ఉన్నా.. తనను తాను 'పిల్లల రక్షకుడి'గా చూపించుకునేందుకు ఆయన కల్పిత కథనాలు మీడియాలో సృష్టించారని, గోరఖ్‌పూర్‌లో కఫీల్‌ఖాన్‌కు 50 పడకల ప్రైవేటు పిల్లల ఆస్పత్రి ఉందని, దీనిని డెంటిస్ట్‌ అయిన తన భార్య షబిస్తా ఖాన్‌ ఆధ్వర్యంలో నడుపుతున్నాడని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అసలు బీఆర్డీ ఆస్పత్రిలో ఆక్సీజన్‌ సిలిండర్ల కొరతకు కఫీల్‌ ఖాన్‌తోపాటు, కాలేజీ మాజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆర్కే మిశ్రా కారణమని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇప్పటికే మిశ్రాపై సస్పెన్షన్‌ వేటు పడటంతో ఆయన రాజీనామా చేశారు. తాజాగా మీడియాలో తప్పుడు కథనాలు సృష్టించారని, విధులను ఉల్లంఘించారని కఫీల్‌ ఖాన్‌పై వేటు వేశారు.
 

మరిన్ని వార్తలు