ఇదెలా కనిపెడుతోందబ్బా!

9 Apr, 2017 19:29 IST|Sakshi
ఇదెలా కనిపెడుతోందబ్బా!

లండన్‌: మీరో కంటెయినర్‌లో ఏదో ఆహారపదార్థం పెట్టి గదిలో ఏ మూలనో పెట్టేస్తే.. మీ పెంపుడు కుక్క దాన్ని కచ్చితంగా గుర్తు పట్టేస్తే మీరు ఆశ్చర్యపోతారు కదా? అయితే కుక్కలకు ఆ శక్తి ఉందని, అవి మనిషి దృక్పథాన్ని, సంకేతాలను విశ్లేషించి ఆహారపదార్థాలు దాచిన ప్రదేశాలను కచ్చితంగా గుర్తు పడతాయని తాజా అధ్యయనంలో తేలింది. మనిషి నిల్చునే స్థానం, వారి కదలికలు, చూపును విశ్లేషించి కుక్కలు ఒక అంచనాకు వస్తాయని పరిశోధకులు తేల్చారు.

మానసికశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తికి సంబంధించిన మానసిక స్థితిని, భావోద్వేగాలను, ఉద్దేశాలను, విజ్ఞానాన్ని ఎదుటి వ్యక్తి అంచనా వేయగలడని, ఈ సామర్థ్యం మనిషి జీవితంలోని తొలి నాలుగైదు సంవత్సరాల్లోనే అభివృద్ధి చెందుతుందని, జంతువుల్లో ఇది ఉండదని ఆస్ట్రేలియాలోని మెస్సర్లీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు పేర్కొన్నారు. మనిషి ముఖ కవళికలను పరిశీలించి కుక్కలు ఒక అంచనాకు వస్తాయనే విషయాన్ని నిరూపించేందుకు పరిశోధకులు ఇద్దరు వ్యక్తులతో ఒక ప్రయోగాన్ని చేశారు.

ఒక గదిలో ఉన్న కంటెయినర్లలో ఒక వ్యక్తి ఆహారాన్ని ఉంచుతాడు. ఆ విషయం వేరొక వ్యక్తికి తెలియకుండా అతన్ని దూరంగా ఉంచుతారు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులతో పాటు కుక్కను ఆగదిలోకి తీసుకొస్తే.. ఇద్దరు వ్యక్తులూ రెండు వేర్వేరు కంటెయినర్లను చూపిస్తారు. కాని కుక్క మాత్రం 70 శాతం సందర్భాల్లో ఎవరైతే ఆహారాన్ని పెట్టారో ఆ వ్యక్తి చూపించిన కంటెయినర్‌ దగ్గరికే వెళ్లింది. ఆహారం పెట్టిన కంటెయినర్‌ గురించి కుక్కకు ఏమాత్రం తెలియనప్పటికీ ఆ వ్యక్తి ముఖ కవళికల ఆధారంగా అది కచ్చితమైన అంచనాకు రాగలిగింది. 

మరిన్ని వార్తలు