డాలర్‌కు షాక్!

28 Nov, 2016 19:13 IST|Sakshi
డాలర్‌కు షాక్!
ట్రంప్ విక్టరీతో శరవేగంగా దూసుకెళ్తున్న డాలర్‌కు షాక్ తగిలింది. చమురు మార్కెట్లో సమతుల్యం కోసం ఆయిల్ ఉత్పత్తిలో కోత విధించబోతున్నారనే సంకేతాల నేపథ్యంలో డాలర్ ట్రెండ్ రివర్స్ అయింది. ఈ నవంబర్ నెలలో నేడు అతిపెద్ద పతనాన్ని చవిచూసి, డాలర్ ఇండెక్స్ కుప్పకూలింది. యెన్‌తో పోలిస్తే, డాలర్ 1.6 శాతం పడిపోయింది. అమెరికా ఎన్నికల తర్వాత ద్రవ్యోల్బణం పెరుగునుందనే అంచనాలతో పాటు డిసెంబర్లో ఫెడ్ రేట్ల కోత ఉంటుందని ఆశలతో డాలర్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఓపెక్ సభ్యులు, ఇతర నాన్ ఓపెక్ ఉత్పత్తిదారుల మధ్య సోమవారం జరిగిన భేటీలో ఆయిల్ ఉత్పత్తిపై చర్చించారు.
 
అయితే బుధవారం జరిగే ఓపెక్ సభ్యుల ప్రధాన సమావేశంలో చమురు ఉత్పత్తి కోతకు ఓ సమర్థవంతమైన ఒప్పందం కుదిరే అవకాశమున్నట్టు తెలుస్తోంది. నేడు జరిగిన ఈ సమావేశంలో సౌదీ లీడర్లు పాల్గొనలేదు. చమురు మార్కెట్ దానికదే సమతుల్యం చెందుతుందని, దీనికోసం ఉత్పత్తిలో కోత విధించాల్సినవసరమేముందని సౌదీ ఎనర్జీ మంత్రి ఖలీద్ ఆల్ ఫాలిహ్ ప్రశ్నించారు. కానీ చమురు మార్కెట్‌ను మళ్లీ పునరుద్ధరించడానికి ఉత్పత్తిలో కోత అవసరమేనని మిగతా సభ్యులు భావిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ఆయిల్ ఉత్పత్తిని ఓపెక్ సభ్యులు తగ్గిస్తున్నట్టు నిర్ణయిస్తే అది అమెరికా మార్కెట్‌కు ప్రతికూలంగా మారనుంది. ఈ నేపథ్యంలో సోమవారం డాలర్ విలువ ఒక్కసారిగా కిందకు పడిపోయింది. డాలర్ విలువ పతనంతో యెన్‌తో పాటు ప్రపంచంలో మిగతా కరెన్సీలు కోలుకుంటున్నాయి.  
మరిన్ని వార్తలు