అమెరికాపై మిస్సైల్‌ దాడులా!

3 Jan, 2017 09:21 IST|Sakshi
అమెరికాపై మిస్సైల్‌ దాడులా!

- ఉత్తరకొరియాకు అంత సీస్‌ లేదన్న ట్రంప్‌
- చైనాపైనా సంచలన వ్యాఖ్యలు


వాషింగ్టన్‌:
ఖండాంతర విధ్వంసక క్షిపణి(ఐసీబీఎం)తో అమెరికాపై దాడులు చేస్తామన్న ఉత్తరకొరియా హెచ్చరికలపై అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారిగా స్పందించారు. ఉత్తరకొరియా హెచ్చరికలను తేలికగా కొట్టిపారేశారు. ఆ దేశ మిస్సైళ్లకు అమెరికాపై దాడులు చేయగల సామర్థ్యం లేదని, ఈ విషయంలో ప్రజలు నిశ్చింతగా ఉండొచ్చని అన్నారు. కొరియాకు సహకరి‍స్తున్న చైనాపైనా ట్రంప్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

పక్షపాత వాణిజ్య విధానాన్ని అనుసరిస్తూ చైనా.. అమెరికాను నిలువునా దోచుకుంటున్నదని, అలా డ్రాగెన్‌ దేశం ఇప్పటికే భారీ మొత్తాన్ని, సంపదను పోగేసిందని ట్రంప్‌ ఆరోపించారు. చైనాతో వాణిజ్యం, ఉత్తరకొరియా అణుహెచ్చరికల నేపథ్యంలో సోమవారం ట్విట్టర్‌ వేదికగా ఆయన చేసిన కామెంట్లు మరోసారి ప్రధానవార్తలుగా నిలిచాయి.

అమెరికా సంపదను కొల్లగొడుతోన్న చైనా.. ఉత్తరకొరియాకు సహాయం చేయడంలేదని చెప్పుకోవడంపై ట్రంప్‌ వ్యంగ్య ధోరణిలో ‘నైస్‌’అని కామెంట్‌చేశారు. అణ్వస్త్రదేశంగా తమను గుర్తించాలన్న ఉత్తరకొరియా డిమాండ్‌ ఎన్నటికీ నెరవేరదని, చైనా అండతోనే కొరియా పేట్రేగుతోందన్న ఆయన.. సమగ్రవిధానాలతోనే ఆ రెండుదేశాలకు సమాధానం చెబుతామని అన్నారు. అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ చెప్పుకుంటున్నట్లు ఉత్తరకొరియా అణ్వాయుధాలను తయారుచేసిందనే వాదనను తేలికగా తీసుకోవాలని ట్రంప్‌ పేర్కొన్నారు. ఇప్పటికే ఆ దేశం(ఉత్తరకొరియా) జరిపిన ఖండాంతర క్షిపణి ప్రయోగాలు విఫలమయ్యాయని, అక్కడి నుంచి అమెరికాపైకి దాడులు చేసేంత సీన్‌ లేదని గుర్తుచేశారు. (ఎంత బలమైన దేశమైనా వణికిపోవాలి: ఉత్తరకొరియా)

(కిరాతకులకే కిరాతకుడు కిమ్‌)
(బటన్ నొక్కితే అమెరికా, కొరియా బూడిదైపోతాయి)

 

మరిన్ని వార్తలు