‘ట్రంప్‌ వ్యాఖ్యలతో షాక్‌ తిన్నా’

6 Jun, 2017 14:31 IST|Sakshi
‘ట్రంప్‌ వ్యాఖ్యలతో షాక్‌ తిన్నా’

న్యూఢిల్లీ: పారిస్‌ వాతావరణ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు దిగ్భ్రాంతి కలిగించాయని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. పారిస్‌ ఒప్పందం నుంచి తప్పుకోవాలన్న నిర్ణయంపై అమెరికా పునరాలోచించుకోవాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

ఏడాదిన్నర క్రితం కుదుర్చుకున్న పారిస్‌ ఒప్పందం నుంచి తప్పుకోవాలని ట్రంప్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే. పారిస్‌ ఒప్పందం భారత్‌కు అనుకూలంగా ఉందని ట్రంప్‌ ఆరోపించారు. ఈ ఒడంబడికతో భారత్‌కు పెద్ద మొత్తంలో విదేశీ సాయం అందుతుందని పేర్కొన్నారు. ఈ ఒప్పందంతో అమెరికాతో పాటు ఇతర దేశాలకు ప్రతికూలంగా ఉందని విమర్శించారు.

ఒప్పందం నుంచి తప్పుకోవాలన్న ట్రంప్‌ నిర్ణయాన్ని అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ కూడా సమర్థించింది. 2030 వరకూ చైనా కర్బన ఉద్గారాలకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోబోదని, భారత్‌కు 2.5 ట్రిలియన్‌ డాలర్ల సహాయం అందేవరకూ ఎటువంటి బాధ్యతలు ఉండబోవని వెల్లడించింది.

>
మరిన్ని వార్తలు