మూడో వడ్డింపు తప్పదా?

14 Dec, 2013 02:32 IST|Sakshi
మూడో వడ్డింపు తప్పదా?

ముంబై: ధరల సెగతో వడ్డీరేట్లకు మరోసారి రెక్కలు రానున్నాయి! ఈ నెల 18న చేపట్టనున్న పాలసీ సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ వరుసగా మూడో విడత కీలక పాలసీ రేట్లను పెంచడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. రెపో రేటు(ఆర్‌బీఐ నుంచి తీసుకునే స్వల్పకాలిక నిధులపై బ్యాంకులు చెల్లించే వడ్డీ)ను మరో పావు శాతం పెంచవచ్చనేది బ్రిటిష్ బ్రోకరేజి దిగ్గజం హెచ్‌ఎస్‌బీసీ అభిప్రాయం. ఒక పక్క వృద్ధి మందగమనం ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ వడ్డీరేట్ల పెంపునకే రాజన్ మొగ్గుచూపవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పుడు అన్నింటికంటే ప్రధానంగా ఎగబాకుతున్న ధరలకు కళ్లెం వేయడంపైనే ఆర్‌బీఐ పూర్తిస్థాయిలో దృష్టి పెడుతుందని హెచ్‌ఎస్‌బీసీ పేర్కొంది.
 
 రాజన్‌కు కత్తిమీదసామే...
 నవంబర్‌లో రిటైల్ ధరల ద్రవ్యోల్బణం అనూహ్యంగా 1.07 శాతం ఎగబాకి 11.24 శాతానికి(అక్టోబర్‌లో 10.17%) దూసుకెళ్లడం తెలిసిందే. ఇది తొమ్మిది నెలల గరిష్టం. మరోపక్క, అక్టోబర్‌లో పారిశ్రామికోత్పత్తి తిరోగమనంలోకి జారిపోయి మైనస్ 1.8 శాతం క్షీణించింది. ఈ రెండు గణాంకాలూ వెలువడిన మర్నాడే హెచ్‌ఎస్‌బీసీ తాజా అంచనాలను ప్రకటించింది. ఒకపక్క పరిశ్రమల రివర్స్‌గేర్.. మరోపక్క ధరలు చుక్కలనంటుతుండటంతో రాజన్‌కు ఈసారి పాలసీ సమీక్ష అత్యంత సవాలుగానే నిలవనుంది. సెప్టెంబర్‌లో ఆర్‌బీఐ పగ్గాలు చేపట్టిన రాజన్... వరుసగా రెండు సమీక్షల్లో కూడా వడ్డీరేట్లను పావు శాతం చొప్పున పెంచడం తెలిసిందే. ప్రధానంగా ధరల పెరుగుదలకు అడ్డుకట్టవేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన ప్రకటించారు కూడా. ఇప్పుడు ద్రవ్యోల్బణం మరింత ఎగబాకుతున్న నేపథ్యంలో వడ్డీరేట్లను మరింత పెంచకతప్పని పరిస్థితి నెలకొందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే జరిగితే పారిశ్రామిక రంగం మరింత కుదేలవడం ఖాయమని కార్పొరేట్లు గగ్గోలు పెడుతున్నారు.
 
 బ్యాంక్ ఆఫ్ అమెరికాదీ అదేమాట...
 ద్రవ్యోల్బణం ఆందోళనల ప్రభావంతో 18న మధ్యంతర త్రైమాసిక పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ పావు శాతం రేట్ల పెంపు తప్పదని బ్యాంక్ ఆఫ్ అమెరికా-మెరిల్ లించ్(బీఓఎఫ్‌ఏ-ఎంఎల్) అభిప్రాయపడింది. రెపో రేటు వరుస పెరుగుదల, ఈ విధానంలో నిధులసమీకరణ పరిమితుల నేపథ్యంలో బ్యాంకులు ఇక తమ అదనపు  లిక్విడిటీ అవసరాలకోసం మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ(ఎంఎస్‌ఎఫ్)పై అధికంగా ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని కూడా పేర్కొంది.
 
  ప్రస్తుతం రెపో రేటు 7.75%, రివర్స్ రెపో 6.75%, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్) 4%గా కొనసాగుతున్నాయి. కాగా, ఎంఎస్‌ఎఫ్ 8.75 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం కట్టడే తమ ప్రధాన కర్తవ్యమని తాజాగా రాజన్ మరోసారి స్పష్టీకరించిన సంగతి తెలిసిందే. మరోపక్క లిక్విడిటీ మెరుగుదలపై దృష్టిసారిస్తామని కూడా చెప్పారు. తద్వారా మరోవిడత వడ్డీరేట్ల పెంపు, ఎంఎస్‌ఎఫ్ తగ్గింపు సంకేతాలిచ్చారు. ‘ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంది. అయితే, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు అంతకంతకూ ఎగబాకుతుండటంతో వృద్ధి, ధరల కట్టడి మధ్య సమతూకంతో వ్యవహరించాల్సి ఉంది’ అని రాజన్ అభిప్రాయపడ్డారు. ఇదిలాఉండగా.. టోకు ధరల ఆధారిత(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం రేటు కూడా నవంబర్‌లో కాస్త పెరిగి.. 7.1 శాతానికి చేరొచ్చని బీఓఎఫ్‌ఏ-ఎంఎల్ అంచనా వేసింది. అక్టోబర్‌లో ఈ రేటు 7%.

మరిన్ని వార్తలు