మాజీ సైనికులకు ‘డబుల్‌ పెన్షన్‌’

24 Dec, 2016 01:54 IST|Sakshi
మాజీ సైనికులకు ‘డబుల్‌ పెన్షన్‌’

సీఎం కేసీఆర్‌ నిర్ణయం
వారి నివాస గృహాలకు ఆస్తి పన్ను మినహాయింపు
అమర సైనికుల కుటుంబాలకు పెన్షన్‌ రూ.6 వేలకు పెంపు


సాక్షి, హైదరాబాద్‌: మిలటరీలో పని చేసి రిటైర్‌ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో మరో ఉద్యోగం చేసిన వారికి డబుల్‌ పెన్షన్‌ విధానం అమలు చేయాలని సీఎం కె.చంద్ర శేఖర్‌రావు నిర్ణయించారు. మిలటరీ, ఉద్యోగు లు, అమర సైనికుల కుటుంబ సంక్షేమం, ఉద్యోగుల సంక్షేమం తదితర అంశాలపై ప్రగతి భవన్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌ చంద్ర, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, పోలీసు ఉన్నతాధికారులు నవీన్‌చంద్, ఎంకే సింగ్, టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్, అధ్యక్షు డు కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్య దర్శి ఎం.రాజేందర్‌ పాల్గొన్నారు.

‘మిలటరీలో పనిచేసి రిటైరై, మరో ఉద్యోగం చేసి విరమణ పొందిన వారికి కేవలం ఒకే పెన్షన్‌ పొందే అవకాశం ఇప్పటివరకు ఉంది. అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో మాజీ సైనిక ఉద్యోగు లు పనిచేస్తే, మిలటరీ ఇచ్చే పెన్షన్‌తో సంబం ధం లేకుండా రాష్ట్ర సర్వీసు నిబంధనలను అనుసరించి పెన్షన్‌ ఇవ్వాలి’ అని సీఎం అన్నారు. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. దేశ రక్షణకు ప్రాణాలర్పించిన సైనికుల కుటుంబాల పట్ల యావత్‌ సమాజం సానుభూతితో ఉండాలని, ఆ కుటుంబ పోషణ బాధ్యత దేశం స్వీకరించాలని అన్నారు. సైనికులు, మాజీ సైనికులు, అమర సైనికుల కుటుంబాల సంక్షేమానికి రాష్ట్ర పరిధిలోని అంశాల విష యంలో ప్రభుత్వం ఉదారంగా వ్యహరిస్తుందని అన్నారు. మూడు దశాబ్దాలకు పైగా సర్వీసులో ఉండి సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం విషయంలోనూ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని తెలిపారు.

సైనికుల నివాస గృహాలకు ఆస్తి పన్ను మినహాయింపు
సైనికులు నిర్మించుకున్న నివాసాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కేసీఆర్‌ నిర్ణయించారు. సదరు నివాస గృహం సైనికుడి పేరు మీద ఉన్నా, సైని కుడి భార్య పేరు మీదున్నా, ఎన్ని అంత స్తులున్నా సరే ఆస్తి పన్ను మినహాయింపు ఇవ్వాలని సూచించారు. ఇందుకు సంబం ధించి వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని, అధికారులు ఆ ప్రకారం నడు చుకోవాలని ఆదేశించారు.

అమర సైనికుల భార్య (యుద్ధంలో మరణించిన సైనికుల భార్యలు – వార్‌ విడో)లకు ప్రభుత్వం తరఫున ఇచ్చే పెన్షన్‌ రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచినట్లు సీఎం వెల్లడిం చారు. సైనికులు, మాజీ సైనికులు, అమర సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం మరిన్ని చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.

మరిన్ని వార్తలు