అర్మేనియా అల్లకల్లోలం

30 Jul, 2016 19:17 IST|Sakshi
అర్మేనియా అల్లకల్లోలం

యెరెవాన్: ప్రతిపక్ష నేత సహా ఇతర రాజకీయ ఖైదీలను విడుదల చేయాలంటూ కొనసాగుతున్న ఆందోళనలతో పశ్చిమ ఆసియా దేశం అర్మేనియా అల్లకల్లలంగా మారింది. వివాదాస్పద 'నాగోర్నో-కరాబఖ్' ప్రాంతంపై ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య తలెత్తిన వివాదం.. అల్లర్లు, సాయుధపోరుగా మారింది. అధ్యక్షుడు షెర్జ్ సర్గ్ శ్యాన్.. ప్రతిపక్ష నాయకుడైన జిరాయిర్ సెఫిల్యాన్ ను జైలుకు పంపడంతో గొడవలు ముదిరి పాకానపడ్డాయి. శుక్రవారం ఓ పోలీస్ స్టేషన్ కేంద్రంగా భద్రతా బలగాలకు, ఆందోళనకారులకు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగాయి. ఇరుపక్షాలకు చెందిన వందలమంది గాయాలపాలయ్యారని అర్మేనియా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

పోలీస్ స్టేషన్ ఆక్రమణ.. బాంబుల మోత
జైలులో ఉన్న ప్రతిపక్ష నేత సెఫిల్యాన్ ను విడుదల చేయాలంటూ ఆయన అనుకూలురైన 40 మంది సాయుధులు.. జులై 17న దేశ రాజధాని యెరెవాన్ లోని ఓ పోలీస్ స్టేషన్ పై దాడిచేసి, పోలీసులను బందీలుగా పట్టుకున్నారు. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు పోలీస్ స్టేషన్ ను చుట్టుముట్టి కాల్పులు జరుపగా కొందరు సాయుధులు చనిపోయారు. మిగిలవారు గత 13 రోజుల నుంచి అదే పోలీస్ స్టేషన్ లో దాక్కొని...బందీలను ఒక్కొక్కరిగా విడుదల చేశారు.

కాగా, శుక్రవారం పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది. ప్రతిపక్ష పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని, భద్రతా బలగాలతో తలపడ్డారు. ఇదే అదనుగా పోలీస్ స్టేషన్ లోని సాయుధులు.. భద్రతా బలగాలపై బాంబులు విసిరారు. ఇటు నుంచి కూడా కాల్పులు జరిగాయి. గంటల తర్వాతగానీ హోరాహోరీ ఘర్షణలు ఆగలేదు. చివరకు 26 మంది అరెస్ట్ అయినట్లు, వందలమంది గాయపడ్డట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికీ 24 మంది సాయుధులు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. పొరుగుదేశం టర్కీలో సైనిక తిరుగుబాటు విఫలమైన తర్వాత అర్మేనియాలోనూ రాజకీయ అస్థిరత, అంతర్యుద్ధ సూచనలు పెరుగుతున్నాయి.

'నాగోర్నో-కరాబఖ్'వివాదం..
యూఎస్ఎస్ఆర్ పతనమైన తర్వాత స్వతంత్ర్య దేశాలుగా విడిపోయిన అర్మేనియా, అజర్బైజాన్ దేశాల మధ్య రావణకాష్ట్రంలా రగులుతున్నది 'నాగోర్నో-కరాబఖ్' వివాదం. ప్రస్తుతం అజర్బైజాన్ దేశంలో అంతర్భాగంగా ఉన్న ఈ ప్రాంతంలో అర్మేనియన్లదే మెజారిటీ. దీంతో ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని అర్మేనియాలోని కొన్ని రాజకీయ పక్షాలు డిమాండ్ లేవనెత్తాయి. క్రమంగా 'నాగోర్నో-కరాబఖ్'వివాదమే అక్కడి రాజకీయపార్టీల మనుగడకు ప్రధానాంశంగా మారింది.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు