భారీగా తగ్గిన రెడ్డీస్ నికర లాభం

27 Jul, 2016 00:20 IST|Sakshi
భారీగా తగ్గిన రెడ్డీస్ నికర లాభం

నికర లాభం 76% తగ్గి రూ.153 కోట్లకు
టర్నోవరు 14 శాతం పడి రూ.3,222 కోట్లకు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఔషధ రంగ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ జూన్ త్రైమాసికం(2016-17, క్యూ1) కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికర లాభం భారీగా తగ్గింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం 76 శాతం తగ్గి రూ.647.4 కోట్ల నుంచి రూ.153.5 కోట్లకు వచ్చి చేరింది. టర్నోవరు 14.11 శాతం పడి రూ.3,752 కోట్ల నుంచి రూ.3,222 కోట్లుగా ఉంది. నిర్వహణ లాభం 60 శాతం తగ్గి రూ.400 కోట్లు నమోదు చేసింది. యూఎస్, వెనిజులా మార్కెట్లలో అమ్మకాలు మందగించడమే లాభం తగ్గడానికి కారణమని కంపెనీ వెల్లడించింది. యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి వార్నింగ్ లెటర్ రావడంతో ఉత్పత్తుల విడుదల ఆలస్యం కావడం ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపిందని వివరించింది. పోటీ పెరగడంతో ప్రధాన మాలిక్యూల్స్ విలువ పడిపోవడం కూడా సమస్యను పెంచిందని డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభిజిత్ ముఖర్జీ వెల్లడించారు. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సౌమెన్ చక్రవర్తితో కలసి ఈ సందర్భంగా మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు.

 పెరిగిన భారత వ్యాపారం..: ఉత్తర అమెరికా జనరిక్స్ వ్యాపారం 16.2 శాతం తగ్గి రూ.1,552 కోట్లు నమోదు చేసింది. ఇక యూరప్ జనరిక్స్ వ్యాపారం 16 శాతం పడి రూ.161.5 కోట్లుగా ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లు 26 శాతం తగ్గి రూ.427.7 కోట్లను తాకాయి. వీటికి భిన్నంగా భారత్‌లో కంపెనీ వ్యాపారం పెరిగింది. జూన్ త్రైమాసికంలో భారత మార్కెట్ 10 శాతం వృద్ధి చెంది రూ.522 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. ఫార్మాస్యూటికల్ సర్వీసెస్, యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ ఆదాయం 16 శాతం పడి రూ.469 కోట్లుగా ఉంది. పరిశోధన, అభివృద్ధికి చేసిన వ్యయాలు 9 శాతం అధికమై రూ.480 కోట్లుంది.

 5 శాతం పడిన షేర్లు..
త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో రెడ్డీస్ షేరు మంగళవారం సుమారు 5 శాతం పడింది. బీఎస్‌ఈలో షేరు 4.37% పడి రూ.3,322.85 వద్ద స్థిరపడింది. ఇంట్రా డేలో 5.15 శాతం తగ్గి రూ.3,295 నమోదు చేసింది. ఎన్‌ఎస్‌ఈలో షేరు 4.67 శాతం పడి రూ.3,319.65 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈలో 1.54 లక్షల షేర్లు, ఎన్‌ఎస్‌ఈలో 15 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.

మరిన్ని వార్తలు