వేల కోట్ల హవాలా రాకెట్ గుట్టురట్టు

29 Aug, 2016 13:27 IST|Sakshi
వేల కోట్ల హవాలా రాకెట్ గుట్టురట్టు

డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఓ భారీ హవాలా స్కాం గుట్టును రట్టు చేసింది. సామాన్యుల పత్రాలను దొంగిలించి భారీమొత్తాన్ని దేశం నుంచి బయటకు పంపేస్తున్న వైనాన్ని బయటపెట్టింది. ఈ స్కాం దాదాపు రూ. 2వేల కోట్లకు పైగా ఉంటుందని, ఇందులో నాలుగు జాతీయ బ్యాంకులు, ఒక ప్రైవేటు బ్యాంకు పాత్ర కూడా ఉందని డీఆర్ఐ అధికారులు తెలిపారు. గత సంవత్సరం అక్టోబర్ నుంచి 2016 మార్చి వరకు దక్షిణ ముంబైలోని ఆయా బ్యాంకు శాఖల్లో జరిగిందని చెప్పారు.

చాలా స్కాముల్లో జరిగినట్లే ఇక్కడ కూడా ఇందులో పేర్లున్నవాళ్లకు అసలు దీంతో ఏమాత్రం సంబంధం లేకపోగా.. అసలు ఇలా జరిగిందని కూడా తెలియదు. ఉదాహరణకు సినిమాహాల్లో పనిచేసే ఒక కార్మికుడి పేరుతో ఖాతా తెరిచి.. దాన్నుంచి విదేశాల్లో ఉన్న వేరే ఖాతాకు రూ. 400 కోట్లు పంపారు. అలాగే గొవాండీ రైల్వే స్టేషన్‌లో పనిచేసే ఒక స్వీపర్, ఒక టికెట్ కలెక్టర్, ఘట్కోపర్ వద్ద పానీపూరీలు అమ్ముకునే వ్యక్తి.. వీళ్ల పేర్లతో ఖాతాలు తెరిచి రూ. 400-600 కోట్ల వరకు విదేశీ ఖాతాలకు పంపారు.

బోగస్ కంపెనీ ఆఫీసులు నెలకొల్పి, ఈ లావాదేవీలు పూర్తికాగానే వాటిని మూసేస్తున్నారని.. నల్లధనాన్ని పన్నుల బాధ లేని విదేశాలకు పంపడమే వీళ్ల ఉద్దేశమని డీఆర్ఐ అధికారి ఒకరు వివరించారు. ఈ స్కాం మొత్తం ఒక కంపెనీ ద్వారానే జరిగిందని, దాని అడ్రస్ మస్జిడ్ బందర్ ప్రాంతంలో ఉన్నట్లు చూపించారని, ఆగ్నేయాసియా దేశాల నుంచి సరుకులు దిగుమతి చేసుకున్నట్లు చెప్పారని అన్నారు. ప్రాథమిక విచారణ ప్రకారం మొత్తం స్కాం విలువ రూ. 2,232 కోట్లని తెలిపారు. ఇంత మొత్తం విలువగల ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడానికి ఈ డబ్బు పంపినట్లు చూపించినా.. వాస్తవానికి వాటి అసలు ఖరీదు రూ. 25 కోట్లు మాత్రమేనన్నారు. ఇంత పెద్ద పెద్ద లావాదేవీలు జరుగుతున్నా వాటిని బ్యాంకు అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. బంగారం, వజ్రాలను దేశంలోకి స్మగ్లింగ్ చేసుకుని, దానికి సంబంధించిన మొత్తాలను గల్ఫ్, ఆగ్నేయాసియా దేశాలకు హవాలా ద్వారా పంపుతారని కూడా ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు