డ్రగ్స్‌ కేసు: ముగ్గురు సినీ హీరోలకు నోటీసులు

13 Jul, 2017 01:25 IST|Sakshi
ముగ్గురు సినీ హీరోలకు నోటీసులు

- మాదక ద్రవ్యాల కేసుపై సిట్‌ విచారణ
- మరో 8 మంది సినీ ప్రముఖులకూ నోటీసులు


సాక్షి, హైదరాబాద్‌: 
మాదక ద్రవ్యాలు వాడారనే ఆరోపణలపై ఎక్సైజ్‌ అధికారులు బుధవారం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన 11 మందికి నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా సిట్‌ విచారణ ముందు హాజరు కావాలని పేర్కొన్నట్లు సమాచారం. ముగ్గురు యువ హీరోలు, నలుగురు దర్శకులతోపాటు సినీ రంగానికే చెందిన మరో నలుగురు నోటీసులు అందుకున్నవారిలో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.

నోటీసులు అందుకున్న ముగ్గురు హీరోల్లో ఇద్దరు ప్రముఖ నిర్మాతల కుమారులు కాగా మరొకరు వర్ధమాన హీరో ఉన్నట్లు సమాచారం. విచారణ ఎప్పుడు, ఎక్కడ జరుపుతారన్న విషయాలను ఎక్పైజ్‌ అధికారులు గోప్యంగా ఉంచడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

పట్టుబడ్డ మరో డ్రగ్స్‌ ముఠా...
రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్‌ వినియోగం కేసులో ఎక్సైజ్‌ పోలీసులు మరో ముఠాను పట్టుకున్నారు. అమెరికాకు చెందిన ఏరోనాటికల్‌ ఇంజనీర్‌ దుండు అనీశ్‌తోపాటు రిత్వల్‌ అగర్వాల్‌ అనే వ్యక్తిని బుధవారం అరెస్టు చేశారు. అనీష్‌ వద్ద నుంచి 16 యూనిట్ల ఎల్‌ఎస్‌డీ మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. డెహ్రడూన్‌లోని ప్రఖ్యాత డూన్‌ స్కూల్‌లో చదివిన అనీశ్‌ గతంలో నాసాలో పని చేసినట్లు ఎక్సైజ్‌ అదనపు కమిషనర్‌ రాజశేఖర్‌రావు తెలిపారు. డార్క్‌నెట్‌ ద్వారా మొత్తం ఎనిమిది సార్లు డ్రగ్స్‌ ఆర్డర్‌ చేసినట్లు విచారణ అధికారులు గుర్తించారు. అనీష్‌ తెప్పించిన మాదక ద్రవ్యాల్లో కొకైన్, ఎల్‌ఎస్‌డీ, ఎండీఎంఏ, గ్రీన్‌ ఫిల్స్‌ ఉన్నాయని అధికారులు తెలిపారు. రిత్వల్‌ అగర్వాల్‌ అనే వ్యక్తికి వీటిని విక్రయించినట్లు విచారణ అధికారులు గుర్తించారు.