పూరీ జగన్నాథ్‌పై ప్రశ్నల వర్షం...

19 Jul, 2017 15:19 IST|Sakshi
పూరీ జగన్నాథ్‌పై ప్రశ్నల వర్షం...

హైదరాబాద్‌ : సంచ‌ల‌నం రేపిన డ్రగ్స్ మాఫియా కేసులో నోటీసులు అందుకున్న టాలీవుడ్‌ డైరెక్టర్‌ పూరీ జ‌గ‌న్నాథ్...సిట్‌ విచారణలో పలు విషయాలు వెల్లడించినట్లు సమాచారం. విచారణలో భాగంగా పూరి జగన్నాథ్‌పై సిట్‌ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. తన గురించి సుమారు 40 నిమిషాల సేపు చెప్పిన పూరీ.. సినిమా ఇండస్ట్రీలో పబ్‌ కల్చర్‌ సర్వసాధారణమని, తన సినిమాల్లో ఎక్కువగా పబ్‌ సీన్లు ఉంటాయని, ఒక ఈవెంట్‌ ఆర్గనైజర్‌ ద్వారా డ్రగ్స్‌ మాఫియా ప్రధాన సూత్రధారి కెల్విన్‌ పరిచయం అయినట్లు సిట్‌ అధికారులు తెలిపారు. అయితే పరిచయం తర్వాతే కెల్విన్‌ డ్రగ్స్‌ సరఫరా చేస్తాడని తనకు తెలిసినట్లు చెప్పారు.

కాగా విచారణ గదిలో ఓ మానసిక వైద్యుడి పర్యవేక్షణలో పూరీ జగన్నాథ్‌ను అధికారులు ప్రశ్నించారు. మొదటి విడత 20 ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని, అలాగే ఆయన బ్యాంకాక్‌ పర్యటనపై కూడా సిట్‌ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. అయితే సినిమా షూటింగ్‌ల కోసమే బ్యాంకాక్‌ వెళుతోందని పూరీ జగన్నాథ్‌ వెల్లడించినట్లు సమాచారం. ఇక తనకు సినిమా వాళ్లు తప్ప, బయట స్నేహితులు లేరని పేర్కొన్నారు.

సిట్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతోంది. నాంప‌ల్లిలో ఉన్న ఆబ్కారీ ఆఫీసులో సిట్ బృందం పూరీని విచారణ చేశారు. డ్రగ్స్ ముఠా నాయ‌కుడు కెల్విన్‌తో ఉన్న సంబంధాల‌పై సిట్ అధికారులు ఆరా తీశారు.  కొకైన్‌, హెరైన్ లాంటి మాద‌క‌ద్రవ్యాల‌ను అమ్ముతున్న కెల్విన్‌తో పూరీకి ఎటువంటి సంబంధాలు ఉన్నాయ‌న్న కోణంలో సిట్ అధికారులు విచార‌ణ జరుపుతున్నారు. ఎక్సైజ్‌ కమిషనర్‌ చంద్రవదన్‌, ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ విచారణను పర్యవేక్షిస్తున్నారు.

కాగా ఎక్సైజ్ శాఖ‌లోని సెక్షన్‌ 67 ప్రకారం పూరీని విచారిస్తున‍్నట్లు తెలుస్తోంది. కెల్విన్‌తో పూరీ వాట్సాప్ ద్వారా సంబంధాలు కొన‌సాగించాడని, ఆ అంశాన్నే సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.  కెల్విన్ వాట్సాప్‌లో పూరీ బ్యాంక్‌ ఆర్థిక లావాదేవీల గురించి కూడా మెసేజ్ చేశారని, కెల్విన్‌కు పూరీ ఎందుకు సందేశాలు పంపారు, వారిద‍్దరి మ‌ధ్య జ‌రిగిన లావాదేవీలు ఏమిట‌న్న అంశాన్ని సిట్‌ అధికారులు తమ విచారణలో తేల‍్చనున్నారు.

ఒక‌వేళ కెల్విన్ ద‌గ్గర పూరీ డ్రగ్స్ తీసుకున‍్నట్లు అంగీక‌రిస్తే, అది ఆయ‌న కోస‌మా లేక అమ్మేందుకు తీసుకున్నాడా అన్న కోణంలోనూ విచార‌ణ కొన‌సాగ‌నున‍్నది. కాగా పూరీ జగన్నాథ్‌ ఈరోజు ఉదయం పదిన్నరకు కుమారుడు ఆకాశ్‌, సోదరుడు సాయిరాం శంకర్‌తో పాటు తన న్యాయవాదితో కలిసి సిట్‌ కార్యాలయానికి వచ్చారు.
 

సంబంధిత కథనాలు...

పూరీ జగన్నాథ్ విచారణ ఇలా...

డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన పూరీ జగన్నాథ్‌

మరిన్ని వార్తలు