విమానానికి తప్పిన పెను ప్రమాదం

24 Apr, 2017 18:25 IST|Sakshi
విమానానికి తప్పిన పెను ప్రమాదం

కోజికోడ్‌: కేరళలోని కోజికోడ్‌ నుంచి దుబాయ్‌కు బయల్దేరిన ఎయిరిండియా విమానానికి కొద్దిలో పెను ప్రమాదం తప్పింది. సోమవారం కోజికోడ్‌లోని కరిపూర్‌ ఎయిర్‌పోర్టులో విమానం టేకాఫ్‌ తీసుకుంటున్న సమయంలో ఓ ఇంజిన్‌ ఫెయిల్‌ కావడంతో పాటు ఓ టైరు పేలిపోయింది. దీంతో విమానం దారితప్పి రన్‌ వేపై సెంట్రల్‌ లైన్‌ నుంచి ఎడమ వైపుకు 30 మీటర్ల దూరం వెళ్లింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో సిబ్బందితో పాటు 191 మంది ప్రయాణికులు ఉన్నారు.

ఎయిరిండియా-సీ937 విమానం టేకాఫ్‌ తీసుకుంటున్న సమయంలో ఎడమ ఇంజిన్‌ ఫెయిలైనట్టు అధికారులు చెప్పారు. ఈ సమయంలో టైర్‌ రన్‌ వే ల్యాంప్‌ను ఢీకొని పేలినట్టు చెప్పారు. పైలట్‌ విమానాన్ని నియంత్రించడంతో ప్రమాదం తప్పింది. ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో వసతి కల్పించారు. ఈ ఘటన వల్ల విమాన రాకపోకలకు గంటన్నర సేపు అంతరాయం కలిగింది. ప్రయాణికుల కోసం ముంబై నుంచి మరో విమానాన్ని రప్పించినట్టు ఎయిర్‌ పోర్టు మేనేజర్‌ పీపీ వేణుగోపాల్‌ చెప్పారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు