దుబాయ్లో క్లియరెన్స్ సేల్!

5 Jun, 2015 14:31 IST|Sakshi
దుబాయ్లో క్లియరెన్స్ సేల్!

భారతదేశానికి సంబంధించిన మ్యాగీ ఇన్స్టెంట్ నూడుల్స్ అమ్మకాలను దుబాయ్లో నిషేధించారు. అయినా.. 'భారత్, నేపాల్, భూటాన్లలో మాత్రమే అమ్మకానికి' అనే స్టాంపులున్న మ్యాగీ ప్యాకెట్లు అక్కడి సూపర్ మార్కెట్లలో దర్శనమిస్తున్నాయి. భారత్ నుంచి దిగుమతి చేసుకున్న మ్యాగీ నూడుల్స్ అమ్మొద్దంటూ ఫుడ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ గురువారమే నోటీసులు ఇచ్చింది. తక్షణం అలాంటి ప్యాకెట్లను దుకాణాల్లోంచి తీసేయాలని కూడా చెప్పింది. కానీ, ఆ తరహా ప్యాకెట్లు ఇప్పటికీ ఎంచక్కా అక్కడి షెల్ఫుల్లో దర్శనమిస్తున్నాయి. ఈ విషయాన్ని అక్కడి పత్రిక 'ఖలీజ్ టైమ్స్' బయటపెట్టింది.

గత సంవత్సరం భారతదేశంలో తయారైన మ్యాగీ ప్యాకెట్లు దుబాయ్ మార్కెట్లోకి వెల్లువెత్తాయి. భారతదేశం నుంచి వచ్చిన ప్యాకెట్లను అమ్మేందుకు దుబాయ్లో అధికారిక ఏజెంట్లు ఎవరూ లేరని, అందుకే ఇక్కడ ఆ ప్యాకెట్ల అమ్మకాలను వెంటనే ఆపేయాలని, మార్కెట్ల నుంచి తక్షణం ఉపసంహరించాలని అధికారులు ఆదేశించారు.

దుబాయ్లో అమ్ముతున్న ఇండియన్ ఫ్లేవర్ మ్యాగీ నూడుల్స్ను క్లియరెన్సు సేల్ కింద.. డిస్కౌంటు రేట్లకు అమ్మేస్తున్నారు. కొన్ని నెలల క్రితమే భారతదేశం నుంచి ఈ ప్యాకెట్లు దుబాయ్ మార్కెట్లలోకి వచ్చినట్లు మరో అధికారి నిర్ధారించారు. నాలుగు సూపర్ మార్కెట్ల చైన్లలో వీటిని అమ్ముతున్నట్లు తేలింది. మలేసియాలోని నెస్లె కంపెనీలో తయారైన ఆరు ఫ్లేవర్ల మ్యాగీ నూడుల్స్ను మాత్రమే దుబాయ్లో అమ్మేందుకు అనుమతి ఉంది.

>
మరిన్ని వార్తలు