వాన ధాటికి లింగంపల్లి బస్సులో..!

31 Aug, 2016 17:01 IST|Sakshi
వాన ధాటికి లింగంపల్లి బస్సులో..!

చాలారోజులకు వరుణుడు నగరంపై కరుణ చూపాడు. నిన్నమొన్నటివరకు ఎండలతో, ఉక్కపోతతో అల్లాడిన నగరవాసులకు వర్షాకాలం ఎలా ఉంటుందో ఒక్కసారిగా మీదపడి రుచి చూపించాడు. ఇటీవలికాలంలో ఎన్నడూలేని రీతిలో భారీ కుంభవృష్టి మన విశ్వనగరాన్ని ముంచెత్తింది.

ట్రాఫిక్‌ అస్తవ్యస్తమైంది. రోడ్లు, వీధులు నదులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు మునకేశాయి. బడుగుల ఇళ్లు కూలాయి. సామాన్యుల కష్టాలు రెట్టింపయ్యాయి. పిల్లల పాఠశాలకు సెలవులొచ్చాయి. ఎనిమిది మంది అభాగ్యులు ప్రాణాలు విడిచారు. వాన కొంత తెరిపి ఇవ్వడంతో నగరంలో పరిస్థితి ఇప్పుడు కొంత కుదుటపడింది. కానీ, వాహనదారులకు, బస్సు ప్రయాణికులకు వాన చుక్కలు చూపింది. ఆర్టీసీ బస్సులు చాలావరకు పాతవి కావడంతో కొన్ని మొరాయించగా.. మరికొన్ని బస్సుల్లో ప్రయాణికులు ఇంకోరకం కష్టాలు ఎదురయ్యాయి. బస్సులకు అన్ని చిల్లులు ఉండటంతో బస్సు ఎక్కినా గొడుగు పట్టుకొని కూర్చొక తప్పని పరిస్థితి నెలకొంది.

లింగంపల్లి నుంచి దిల్‌సుఖ్‌ నగర్‌ వెళ్లే (218 నంబర్‌) బస్సులో ప్రయాణించినవారికి చిత్రమైన అనుభవం ఎదురైంది. భారీ వర్షంలో ప్రయాణిస్తున్న వారిని వరుణుడి బస్సు కాపాడలేకపోయింది. వర్షం ధాటికి బస్సు మొత్తం కురుస్తుండటంతో వారు బస్సులోపలే గొడుగులు వేసుకొని కూర్చోవాల్సిన పరిస్థితి. 'ప్యార్‌ హువా.. ఏక్‌ రార్‌ హువా..' 'చిటచిట చినకులు పడుతూ ఉంటే' అన్న పాటలు వారికి గుర్తొచ్చాయో లేదో కానీ, బస్సులో గొడుగు జర్నీతో వారు బతుకు బండిని లాగించారు.

మరిన్ని వార్తలు