చార్మి పిటిషన్‌ పబ్లిసిటీ స‍్టంట్‌..

25 Jul, 2017 12:35 IST|Sakshi
చార్మి పిటిషన్‌ పబ్లిసిటీ స‍్టంట్‌..

►తప్పు చేయకుంటే భయమెందుకు?

హైదరాబాద్‌ : డ్రగ్స్‌ కేసులో సినీనటి చార్మిని కేవలం సాక్షిగా మాత్రమే విచారణ చేస్తామని ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు. ఈ కేసులో నోటీసులు అందుకున్న చార్మీ నిన్న హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌ను కోర్టు మంగళవారం ఉదయం  విచారించింది. ఇరు వాదనలు విన్న హైకోర్టు తీర్పును మధ్యాహ్నం 2.30 గంటలకు కోర్టు వాయిదా వేసింది. ఈ సందర్భంగా చార్మి తరఫు న్యాయవాది చేసిన ఆరోపణలను సిట్‌ తరఫు న్యాయవాది కొట్టిపారేశారు. చార్మి వేసిన పిటిషన్‌ కేవలం పబ్లిసిటీ స్టంట్‌ అని, తప్పు చేయకుంటే భయమెందుకని, ఎన్డీపీఎస్‌ యాక్ట్‌ ప్రకారమే కేసు విచారణ కొనసాగుతోందని అన్నారు. డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌ వెల్లడించిన ఆధారాలతోనే ఈ విచారణ కొనసాగుతోందన్నారు.

అలాగే చార్మి అంగీకారంతోనే ఆమె నుంచి బ్లడ్‌ శాంపిల్స్‌ సేకరిస్తామని సిట్‌ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఆమె ఎక్కడ కోరుకుంటే అక్కడ విచారణ చేపడతామని గతంలో ఆమెకు తెలిపామని.. ఇందుకు చార్మి స్పందించి విచారణ కోసం సిట్‌ కార్యాలయానికే వస్తానని తెలిపిందని చెప్పారు. మరోవైపు  సిట్‌ విచారణ చట్ట విరుద్ధంగా సాగుతోందని...  బలవంతంగా రక్తనమూనా సేకరణ చేయకుండా ఆదేశాలివ్వాలని చార్మీ తరఫు లాయర్‌ విష్ణువర్ధన్‌రెడ్డి వాదనలు వినిపించారు. విచారణ సమయంలో లాయర్‌ను అనుమతివ్వాలని కూడా కోర్టును కోరామన్నారు. రాజ్యాంగ హక్కులకు భంగం కలగకుండా చర్యలు తీసుకోమని కోర్టుకు విన్నవించారు.