ప్రతీ పొలం గూగుల్ మ్యాప్‌లో కనపడాలి

4 Oct, 2015 03:55 IST|Sakshi
ప్రతీ పొలం గూగుల్ మ్యాప్‌లో కనపడాలి

పర్యాటక ప్రాంతంగా రాజధాని శంకుస్థాపన ప్రాంతం
టెలీ కాన్ఫరెన్స్, సమీక్ష సమావేశాల్లో ముఖ్యమంత్రి

 
 సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలోని ప్రతి పొలాన్ని జియో ట్యాగింగ్ చేసి గూగుల్ మ్యాప్‌లో చూపించే స్థాయికి చేరుకోవాలని రెవెన్యూ శాఖాధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ‘మీ ఇంటికి-మీభూమి’లో అందిన ఫిర్యాదులన్నింటినీ ఈ నెల 15లోపు పరిష్కరించాలని ఆదేశించారు. ఆయన శనివారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి  నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని రెండో దశ నిర్వహించేందుకు నవంబర్ ఒకటి నుంచి ఏర్పాట్లుచేసుకోవాలన్నారు.

 ఏపీకి అమరావతి :ఢిల్లీలో ఇండియా గేట్, ముంబయిలో గేట్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్‌లో చార్మినార్ మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి శంకుస్థాపన ప్రాంతం అద్భుతంగా నిలిచిపోవాలని సీఎం చెప్పారు. ఆయన శనివారం తన క్యాంపు కార్యాలయంలో సీఆర్‌డీఏ సమావేశంలో మాట్లాడుతూ...  శంకుస్థాపన ప్రదేశం చారిత్రాత్మక, పర్యాటక ప్రాంతంగా  నిలిచిపోవాలన్నారు.

  సమ్మె కాలాన్ని సీఎల్స్‌గా పరిశీలిస్తా...
 సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిన 60రోజులను స్పెషల్ క్యాజువల్ లీవ్(సీఎల్స్)గా పరిగణించే విషయాన్ని ఆర్థిక వెసులుబాటును బట్టి పరిశీలిస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులకు 43శాతం ఫిట్‌మెంట్ ఇచ్చినందుకు కార్మిక పరిషత్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి విజయవాడలో సీఎంకు కృతజ్ఞత సత్కారం చేశారు. సీఎం మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు డిపోల వారీగా శాశ్వత గృహాలను, ప్రతీ బస్‌స్టేషన్‌లోను మహిళా కండక్లర్లకు ప్రత్యేక విశ్రాంతి గదులు నిర్మిస్తామని చెప్పారు. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్, సిబ్బంది రిటైర్ అయిన తర్వాత కూడా ఉచితంగా ఆర్టీసీ బస్ ప్రయాణం చేసే అవకాశం ఇస్తామని చెప్పారు.

 డ్వాక్రా సంఘాల వల్లే  దారితప్పింది...
 ఇసుక విక్రయాల విధానం దారితప్పడానికి డ్వాక్రా సంఘాలు వాటి బాధ్యతను పూర్తిస్థాయిలో తీసుకోకపోవడమే కారణమని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఇసుక విక్రయాల కార్యాచరణ ప్రణాళిక, పెన్షన్లు, డ్వాక్రా రుణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

>
మరిన్ని వార్తలు