బిహార్‌ రాజకీయాల్లో మరో ట్విస్ట్‌

10 Jul, 2017 19:42 IST|Sakshi
బిహార్‌ రాజకీయాల్లో మరో ట్విస్ట్‌

పట్నా: బిహార్‌ రాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌కు మద్దతు ఇచ్చిందుకు బీజేపీ ముందుకు వచ్చింది. అసవరం అయితే బయట నుంచి మద్దతు ఇస్తామని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నిత్యానంద్‌ రాయ్‌ వెల్లడించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అయితే మద్దతుపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర నాయకత్వమేనని అన్నారు. కాగా ఆర్జేడీ మద్దతుతోనే రాష్ట్రంలో నితీష్‌ ప్రభుత్వం మనుగడ సాగిస్తున్న విషయం తెల్సిందే.

అయితే  ఆరోపణలు ఎదుర్కొంటున్న తేజస్వి యాదవ్‌ డిప్యూటీ సీఎం పదవిని వదిలేందుకు ససేమిరా అంటున్నారు. అలాగే ఆర్జేడీ నేతలు కూడా ఆయన రాజీనామా చేసే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు. మరోవైపు జనతా అదాలత్‌ను రద్దు చేసుకున్న ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తూ, ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తన ప్రభుత్వానికి మద్దతిస్తున్న కాంగ్రెస్‌ పార్టీని బహిరంగంగానే ఇటీవల తీవ్రంగా విమర్శించిన నితీష్‌, లాలూ కుటుంబం విషయంలో సమన్వయం పాటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో జేడీయూ మంగళవారం అత్యవసరంగా సమావేశం కానుంది. ఈ కీలక భేటీలోనే తేజస్వి యాదవ్‌ పదవిపై నితీష్‌ నిర్ణయం తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. అలాగే ప్రభుత్వం మనగడకు మద్దతిచ్చేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని బీజేపీ సంకేతాలు ఇవ్వడంతో నితీష్‌ కుమార్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సస్పెన్స్‌ నెలకొంది.

మరిన్ని వార్తలు