వెబ్ అప్షన్ల నమోదు తాత్కాలిక వాయిదా

22 Aug, 2013 04:19 IST|Sakshi

 రెండు, మూడు రోజుల్లో రీషెడ్యూల్: ఉన్నత విద్యామండలి
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నేడు (గురువారం) ప్రారంభం కావాల్సిన వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. అయితే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ మాత్రం యథాతథంగా కొనసాగుతుందని పేర్కొంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గురు, శుక్రవారాల్లో 1 నుంచి 40 వేల ర్యాంకు వరకు గల అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. అయితే ఈ నెల 19న ప్రారంభమైన సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియలో 40 వేల ర్యాంకులోపు గల అభ్యర్థులు అందరూ హాజరు కాలేదు.
 
  సీమాంధ్ర ప్రాంతంలో 37 హెల్ప్‌లైన్ సెంటర్లకుగాను 17 మాత్రమే నడవడంతో పలువురు అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన చెందుతారన్న కారణంగా వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేశామని, రెండు, మూడు రోజుల్లో రీషెడ్యూల్‌ను ప్రకటిస్తామని అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి కె.రఘునాథ్ తెలిపారు. బుధవారం రాత్రి 7 గంటల వరకూ మొత్తం 15 వేల మందికిగాను 9,432 మంది అభ్యర్థులు మాత్రమే సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియకు హాజరయ్యారు. సీమాంధ్రలో 17 సహాయక కేంద్రాలే పనిచేశాయని, వీటిలో 4,216 మంది హాజరయ్యారని రఘునాథ్ తెలిపారు. తెలంగాణలోని 22 కేంద్రాల్లో 5,216 మంది హాజరైనట్టు తెలిపారు. తొలి రెండు రోజులతో పోల్చితే మూడో రోజు సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియకు హాజరు పెరిగిందని వివరించారు.
 
 హైదరాబాద్‌లో కొత్తగా 4 కేంద్రాలు..
 ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా సర్టిఫికెట్ల తనిఖీకి హాజరుకాలేకపోయిన అభ్యర్థుల కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నాలుగు సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు అడ్మిషన్ల క్యాంపు అధికారి వెల్లడించారు. నిజాం కళాశాల, సైఫాబాద్ డిగ్రీ కళాశాల, సికింద్రాబాద్‌లోని ఓయూ పీజీ కళాశాల, దోమలగూడలోని ఏవీ కళాశాలలో ఈ కేంద్రాలను ఒకటి, రెండు రోజుల్లో ప్రారంభించనున్నట్టు తెలిపారు. మూడో రోజు సర్టిఫికెట్ల తనిఖీకి సీమాంధ్ర జిల్లాల నుంచి తెలంగాణ ప్రాంతంలోని సహాయక కేంద్రాలకు వచ్చిన విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పనిలేదని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పి.జయప్రకాశ్‌రావు తెలిపారు. ప్రతి అభ్యర్థి సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల నమోదులో పాల్గొన్నాకే.. సీట్ల కేటాయింపు ఉంటుందని వివరించారు. సీమాంధ్ర ప్రాంతంలో అధ్యాపకులు ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియకు సహకరించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని విజ్ఞప్తి చేశారు.  

మరిన్ని వార్తలు