భూమ్మీదున్న చెట్లు.. మూడు లక్షల కోట్లు!

6 Sep, 2015 01:53 IST|Sakshi
భూమ్మీదున్న చెట్లు.. మూడు లక్షల కోట్లు!

భూమ్మీదున్నమనుషులెందరు (సుమారు 720 కోట్లు)? కార్లెన్ని (120 కోట్లు)? తిమింగలాలెన్ని (17 లక్షలు)? ... ఈ ప్రశ్నలకు వాస్తవానికి దగ్గరగా సమాధానాలు వెదకొచ్చు. కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చెట్లెన్ని? అంటే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే! అయితే, తొట్టతొలిగా సేకరించిన చెట్ల గణాంకాల ప్రకారం.. మూడు లక్షల కోట్లు! ప్రపంచవ్యాప్తంగా చెట్ల సంఖ్య 40 వేల కోట్ల వరకు ఉండొచ్చన్నది ఇప్పటి వరకు ఉన్న అంచనా. అయితే, ఒక్క అమెజాన్ నదీ పరీవాహక ప్రాంతంలోనే సుమారు 40 వేల కోట్ల చెట్లున్నాయని తాజాగా తేలింది.

యేల్ స్కూల్ ఆఫ్ ఫారెస్ట్రీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ (అమెరికా) తాజాగా వృక్ష గణన ప్రక్రియ నిర్వహించి, దరిదాపుగా మూడు లక్షల కోట్ల చెట్లున్నట్లు తేల్చింది. చెట్లు లేని మంచు ఖండం అంటార్కిటికా మినహా అన్ని ఖండాల నుంచి సేకరించిన వివరాలను క్రోడీకరించి ఈ లెక్క తేల్చారు. చిన్నా, పెద్దా, ఆడా, మగా అన్న తేడా లేకుండా తలసరిన 429 చెట్లున్నాయట. ఇంతకీ ఇవన్నీ మనం కొట్టేయగా మిగిలిన చెట్ల సంఖ్య మాత్రమే సుమా! 12 వేల ఏళ్ల క్రితం మనుషులు స్థిర నివాసం ఏర్పరచుకున్న కొత్తల్లో..

ఆరున్నర లక్షల కోట్ల చెట్లుండేవట. కాలక్రమంలో 46 % వరకు చెట్లను నరికేయగా.. ఇప్పుడు 3 లక్షల కోట్ల చెట్లు మిగిలాయన్న మాట. ప్రతి ఏటా 1500 కోట్ల చెట్లను నరికేస్తున్నట్లు యేల్స్ స్కూల్ లెక్కగట్టింది! జన సంఖ్య ఎంత వేగంగా పెరుగుతుంటే చెట్ల సంఖ్య అంత వేగంగా తగ్గిపోతోంది. అంటే.. మనం లేకపోతే చెట్లు హాయిగా బతుకుతాయి. కానీ, చెట్లు లేకపోతే మాత్రం మనం బతికి బట్ట కట్టలేం!

మరిన్ని వార్తలు