విశాఖలో ఈస్ట్‌కోస్ట్ మారిటైం బిజినెస్ సమ్మిట్ ప్రారంభం

20 Sep, 2013 01:03 IST|Sakshi


 సాక్షి, విశాఖపట్నం:  దేశంలో పోర్టుల ద్వారా జరిగే సముద్ర అధారిత ఎగుమతి, దిగుమతుల వ్యాపారంలో భవిష్యత్తంతా తూర్పుతీరానిదేనని ఈస్ట్‌కోస్ట్ మారిటైం బిజినెస్ సమ్మిట్ స్పష్టంచేసింది. ఎరువులు, బొగ్గు, ముడి ఇనుము ఎగుమతి, దిగుమతుల్లో  తూర్పుతీరం పోర్టులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని విశ్లేషించింది. తూర్పు తీరంలో మేజర్ పోర్టుల సంఖ్య  పెరుగుతుండడం, అదే సమయంలో పశ్చిమతీరంలోని కీలక రేవుల్లో కార్గో హ్యాండ్లింగ్ క్షీణిస్తుండడం ఈ ప్రాంతానికి కలిసిరానుందని గురువారం విశాఖలో జరిగిన సమ్మిట్‌లో షిప్పింగ్ రంగ నిపుణులు పేర్కొన్నారు.
 
 ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి కె.ప్రదీప్ చంద్ర ప్రసంగిస్తూ, రాష్ట్రంలో సముద్ర అధారిత వ్యాపార రంగం పుంజుకునేలా మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో సముద్ర అధారిత ఎగుమతి, దిగుమతుల రంగానికి మౌలిక సదుపాయాలు కల్పించే ప్రక్రియలో భాగంగా విశాఖ, హైదరాబాద్ సమీపంలో కంటైనర్ రవాణా యార్డులను నిర్మిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ అధారిత ఎగుమతుల ప్రోత్సాహానికి కృష్ణపట్నం పోర్టు సమీపంలో రూ.75 కోట్లతో గోదాములు నిర్మిస్తున్నట్లు తెలిపారు. నాయుడుపేట, కృష్ణపట్నం, శ్రీసీటి సెజ్‌ల ప్రగతికి దోహదపడేలా వెంకటాచలం వద్ద అయిదో నంబర్ జాతీయ రహదారి సమీపంలో లాజిస్టిక్ పార్క్ నిర్మిస్తున్నట్లు వివరించారు.
 
 రూ.2.96 లక్షల కోట్ల వ్యాపారానికి అవకాశం
  సముద్ర అధారిత ఎగుమతి, దిగుమతుల్లో వ్యత్యాసం తీవ్రంగా ఉందని కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ అనిల్ కె.గుప్తా చెప్పారు.  దేశీయ కంటైనర్ కార్గో వ్యాపారం సరాసరి 65 శాతానికి బదులు 52శాతం మాత్రమే ఉందన్నారు. అయిదేళ్లలో తాము తూర్పు తీరంలో రూ.9 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వివరించారు. కోల్‌కతా పోర్టుట్రస్ట్ చైర్మన్ (విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ ఇన్‌చార్జ్  చైర్మన్) ఆర్‌పీఎస్ కేహ్లాన్ కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు