ఎన్నికలకు ఈసీ రోడ్‌మ్యాప్

5 Jan, 2014 01:45 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల సన్నాహకాలపై రోడ్‌మ్యాప్ (మార్గసూచి) రూపొందించుకున్నట్టు విశ్వసనీయంగా తెలియవచ్చింది. ఈ రోడ్‌మ్యాప్ ప్రకారం ఫిబ్రవరి మొదటివారంలో ప్రధాన రాజకీయ పక్షాలతో ఈసీ సమావేశం కానుంది. ఎన్నికల తేదీలపై ఈ భేటీలో అన్నిపక్షాల అభిప్రాయాలను తెలుసుకున్నాక ఫిబ్రవరి మధ్యలో రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో చర్చలు జరపనుంది. ఎన్నికల నిర్వహణకు అనువైన తేదీలపై వారు చేసే సూచనలను పరిగణనలోకి తీసుకోనుంది. అనంతరం మూడోవారంలో రైల్వేబోర్డు చైర్మన్‌తో సమావేశమై ఎన్నికల సిబ్బంది, భద్రతాదళాలు, అదనపు బలగాల రవాణా ఏర్పాట్లపై చర్చించనుంది.

 

అలాగే కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామితోపాటు బీఎస్‌ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ చీఫ్‌లతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకున్నాక ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పోలింగ్ షెడ్యూలును రూపొందించనున్నట్లు ఈసీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుత 15వ లోక్‌సభ పదవీకాలం మే 31తో ముగియనుండటంతో జూన్ 1కల్లా 16వ లోక్‌సభ ఏర్పాటయ్యేలా చూసేందుకు సకాలంలో ఎన్నికలు జరుపుతామని... విడతలవారీగా పోలింగ్ నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ వి.ఎస్.సంపత్ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే.
 
 తప్పుడు అఫిడవిట్లపై చర్యలు తీసుకోండి
 
 జైపూర్: ఎన్నికల్లో పోటీచేసేవారు తప్పుడు అఫిడవిట్లు సమర్పించకుండా నివారణ చర్యలు తీసుకోవాలని న్యాయశాఖకు లేఖ రాసినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వీఎస్ సంపత్ తెలిపారు. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా కొన్ని సూచనలను ఇప్పడికే న్యాయశాఖకు నివేదించామని, అందులో తప్పుడు అఫిడవిట్లు ఇచ్చేవారికి కనీసం రెండేళ్ల వరకూ జైలుశిక్ష, ఎన్నికల నుంచి నిషేధం తదితర చర్యలు సూచించామని సంపత్ వెల్లడించారు. సంస్కరణ విషయంలో ప్రభుత్వం, రాజకీయ పార్టీలతో చర్చిస్తున్నామన్నారు. అయినా ప్రజాభిప్రాయం చాలా ముఖ్యమైందని, దానిని మీడియా వెలుగులోకి తీసుకురావాలని శనివారం ఇక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చెప్పారు. రాష్ట్రాల ఎన్నికల్లో ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగిందని, లోక్‌సభ ఎన్నికల్లో ఆ శాతం ఇంకా పెరగడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యావంతులు ఓటింగ్‌లో పాల్గొని మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని కోరారు. రాజస్థాన్ ఎన్నికల్లో ఈవీఎంలలో లోపాలున్నాయని కాంగ్రెస్ విమర్శించడాన్ని ఆయన తిప్పికొట్టారు. తాము క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వాటిని వినియోగించామని, అందువల్ల లోపాలు ఉండే ఆస్కారం లేదని వివరించారు. మే 31 లోగా లోక్‌సభ ఎన్నికలు జరిపాల్సిఉందని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు.
 

మరిన్ని వార్తలు