ట్యాంపరింగ్‌కు ప్రయత్నిస్తే ఆగిపోతాయి..

3 Apr, 2017 05:07 IST|Sakshi
ట్యాంపరింగ్‌కు ప్రయత్నిస్తే ఆగిపోతాయి..

ఈసీకి కొత్త ఈవీఎంలు
న్యూఢిల్లీ: ట్యాంపరింగ్‌కు యత్నిస్తే పనిచేయడం పూర్తిగా ఆగిపోయే కొత్త రకం ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎం)ను ఎన్నికల సంఘం కొనుగోలు చేయనుంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ కొత్తరకం యంత్రాల కొనుగోలుకు ఉపక్రమించింది. ఈ ‘ఎం–3’ రకం ఈవీఎంలలో యంత్రం కచ్చితత్వాన్ని ధ్రువీకరించే స్వీయ నిర్ధారణ వ్యవస్థ ఉంటుంది. ప్రభుత్వరంగ సంస్థలైన ఈసీఐఎల్‌ లేదా బీఈఎల్‌ తయారు చేసిన అసలైన ఈవీఎం మాత్రమే ఇతర ఈవీఎంలతో అనుసంధానమవుతుంది. ఇతర కంపెనీలు రూపొందించిన ఏ ఈవీఎం అయినా ఇతర యంత్రాలతో అనుసంధానం కాదు. అందువల్ల ట్యాంపరింగ్‌కు అవకాశముండదు.

అంగట్లో ఈవీఎంలు
పింప్రి: ఎన్నికల కోసం ఉపయోగించే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్లు (ఈవీఎంలు) ఇప్పుడు పుణే, బోస్రీ పరిసరాల మార్కెట్‌లో అమ్మకానికి వచ్చాయి. మార్కెట్లో చాలామంది వ్యాపారులు వీటిని ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉంచుతున్నారు. సహకార బ్యాంకులు, ఇతర సంస్థలు, ఉద్యోగ సంఘాలు, పలు సంఘాల ఎన్నికల కోసం వీటిని ఉపయోగించడానికి ఆసక్తి కనబరుస్తుండడంతో ఈవీఎంలకు గిరాకీ పెరిగింది.

ఈవీఎంల ధర రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు ఉంది. వీటిలో పలు రకాల మెషీన్లు ఉన్నాయి. దీనిపై జిల్లా ఎన్నికల అధికారి చంద్రకాంత్‌ను వివరణ అడగ్గా.. సాధారణంగా బజారులో ఈవీఎంలు లభించవని అన్నారు. అయితే ఆన్‌లైన్‌ అమ్మకాలపై విచారణ జరుపుతామని అన్నారు.

మరిన్ని వార్తలు